కూటమి అర్థసంవత్సర పాలన అర్థరహితం
ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఘాటు విమర్శలు
✍️ అమరావతి – దివిటీ (డిసెంబరు 12)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సారథ్యం లో చంద్రబాబునాయుడి అర్ధసంవత్సర పాలన పూర్తిగా “అర్ధ రహితం”, 6 నెలల్లో ఇచ్చిన 6 సూపర్ హామీలకు దిక్కులేదని ఏపీసీసీ అధినేత్రి వై.ఎస్.షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఏపీ ప్రభుత్వపాలనపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన 60హామీలు పత్తాకు లేవన్నారు. మూడు సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్ తోనే ‘మమ’ అనిపించారని పేర్కొన్నారు. రూ.3వేల నిరుద్యోగభృతి ఊసే లేకుండా చేశారని, 20 లక్షల ఉద్యోగాలు అవిగో, ఇవిగో అంటున్నారని ఆరోపించారు. స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి తల్లులకు పంగనామాలు పెట్టారన్నారు. రైతులకు రూ.20 వేలు సాయంచేసే ‘అన్నదాతసుఖీభవ’ పథకం ‘దుఃఖీభవ’గా చేశారని దుయ్యబట్టారు. ప్రతినెల రూ.1500చొప్పున ప్రతి ఆడబిడ్డకు ఇస్తామన్నారని, ఆడబిడ్డనిధి ఎక్కడో అడ్రెస్ లేదన్నారు. ఆర్టీసీ బస్సు లలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడు? అంటే పండుగలు, పబ్బాల పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని షర్మిలారెడ్డి విమర్శించారు. జూన్ 12న తొలిసంతకం పెట్టిన DSC నోటిఫికేషన్ కే ఇప్పటికీ దిక్కులేదని, ఉచితంగా ఇసుక పథకంలో ఉచితం ఎక్కడా లేదన్నారు. బాబు 6 నెలల పాలన “మండలానికి 3 మద్యం షాపులు – 30 బెల్టు షాపులు”గా ఉందన్నారు. అభివృద్ధిలో 3 మాటలు, 30 గ్రాఫిక్స్ డిజైన్లు”గా ఉందన్నారు. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు మళ్లీ అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారన్నారు. “బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కాస్తా “బాబు షూరిటీ-వడ్డింపులకు గ్యారెంటీ ” లాగా మారిందని పేర్కొన్నారు. వచ్చిన 6 నెలల్లోనే 17500 కోట్ల రూపాయలు జనం నెత్తిన వేశారని ఆరోపించారు. క్వాలిటీ మద్యం అంటూనే, ధరలు పెంచి జనాలను పీల్చి పిప్పిచేస్తున్నారని, ఈ ఆర్ధిక భారంపై మా తప్పేం లేదంటూనే జనం నెత్తిన మోపుతున్నారని ఏపీసీసీ అధినేత్రి వై.ఎస్.షర్మిలారెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీల సంగతేంటని అడిగితే, చంద్రబాబు ఇప్పటికీ ‘రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది… వైసీపీ వాళ్లు 5 ఏళ్లు అడవి పందుల్లా మేశారు… వ్యవస్థలను నిర్వీర్యం చేశారు… గాడిలో పెట్టాలి…’ అంటున్నారన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలన దోపిడీపాలన, దొంగలపాలన, నేల, నీరు, ఖనిజం, ఒకటేంటి… కన్ను పడిందల్లా కాజేశారనేది నిజమేనన్నారు. ‘వాళ్లు తిన్నారు కాబట్టే, జనం బుద్ధి చెప్పారని, రాష్ట్రాన్ని దివాలా తీయించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని, మీరేదో ఉద్దరిస్తారని పట్టం కడితే మీరు చేసేది ఏంటి?’ అంటూ ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే ఉంటారా? ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టరా? అంటూ ఆ ప్రకటనలో నిలదీశారు. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ, గత ప్రభుత్వ తప్పిదాలు అడ్డుపెట్టుకుంటూ, 6 నెలలు కాలయాపన చేశారని ఆమె ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. “మీ 4.0 ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది బాబు గారు… ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడండి…” అని ఆ ప్రకటనలో వై.ఎస్.షర్మిలారెడ్డి హితవు పలికారు.