పోలీసులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 27)
నిత్యం శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజాసేవలో బిజీగా ఉండే పోలీసులు తమ ఆరోగ్యం, తమ తమ కుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. పాల్వంచ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. శారీరక, మానసిక వత్తిళ్లతో విధుల నిర్వహణలో విశ్రాంతిలేని జీవితం గడపాల్సి వస్తున్న పరిస్థితుల్లో జిల్లాలో కొంత మంది పోలీస్ అధికారులు సిబ్బంది అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారు. ఈ అంశంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యం ప్రజలకు వైద్య సేవల్లో బిజీగా ఉండే వైద్య బృందం, తాము అడగగానే పోలీస్ కుటుంబాలకు వైద్యం చేయడానికి విచ్చేసినందుకు డీఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను శాలువాలు, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఈసీజీ, గైనకాలజీ, బీపీ, షుగర్, దంత సమస్యలు, కళ్ళపరీక్షలు, ఆర్థోపెడిక్, యూరాలాజీ, ఫిజియోతెరపి, గుండె పరీక్షలు, రక్త పరీక్షలు చేసే నిపుణులైన వైద్యులు శిబిరంలో సేవలు అందించారు. మొత్తం 120 మంది సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ వైద్యశిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సిఐ వినయ్ కుమార్, ఎస్సైలు సుమన్, సురేష్, రాజశేఖర్, రాజేష్, యయాతి రాజు, జీవన్ రాజు, అశ్వారావుపేట సీఐ కరుణాకర్, వైద్య నిపుణులు ముక్కంటేశ్వర రావు, యుగంధర్ రెడ్డి, కోరాశ్రీ, తదితరులు పాల్గొన్నారు.