రేపట్నుంచి రాష్ట్ర ఫుట్ బాల్ జట్టు కోచింగ్ క్యాంప్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 20)
జమ్మూకాశ్మీర్ లో ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర ఫుట్ బాల్ జట్టుకు ఐదురోజుల శిక్షణ శిబిరం గురువారం(నవంబరు 21) ప్రారంభం కానుంది.
జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్-17 బాలుర రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల తో రాష్ట్ర జట్టును ఎంపిక చేసిన విషయం విదితమే. ఆ విధంగా ఎంపికైన తెలంగాణ రాష్ట్ర జట్టు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే జట్టులో వివిధ జిల్లాల క్రీడాకారులుండటంతో జట్టులో సమన్వయం కోసం ఈ 5రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగూడెం ప్రగతిమైదానంలో ఈ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి
ఎం.వెంకటేశ్వరచారి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ బుధవారం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
కల్పించనున్నారు. ఈ జట్టు శిక్షకుడిగా జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు, గౌతంపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పీడీ(ఫిజికల్ డైరెక్టర్) బట్టు ప్రేమ్ కుమార్ వ్యవహరించనున్నారు .