తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ గా డా.వెన్నెల
ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
✍️ హైదరాబాద్ – దివిటీ (నవంబరు 16)
ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’ సంస్థకు చైర్‌పర్సన్‌గా గద్దర్ కుమార్తె డాక్టర్ గుమ్మడి.వి.వెన్నెలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, టూరిజం, కల్చర్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు(జీఓ నెం.328) జారీ చేశారు. 1979లో సికిందరాబాద్ లో గుమ్మడి విఠల్ రావు (గద్దర్) విమల దంపతులకు జన్మించారు వెన్నెల. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేనేజ్ మెంట్ విద్య లో పి.హెచ్.డి చేశారు. స్కూల్ మేనేజ్ మెంట్ లో పీజీ కూడా పూర్తి చేశారు. సికిందరాబాద్ సమీప ఆల్వాల్ ప్రాంతంలో తన తండ్రి గద్దర్ పేద పిల్లల కోసం ‘మహాబోధి విద్యాలయ’ పేరుతో స్థాపించిన స్కూల్’ ను పదేళ్ల నుంచి బాధ్యతలు చేపట్టి నిర్వహిస్తున్నారు. గత 18సంవత్సరాల నుంచి టీచర్ గా పనిచేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన తండ్రి దివంగత గద్దర్ స్థాపించిన ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’ లో 2010 నుంచి పనిచేసిన వెన్నెల, 2023లో తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలిసారి సికిందరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న వెన్నెలకు తెలంగాణ సాంస్కృతిక సారథి బాధ్యతలు అప్పగిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.