ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు
✍️ కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 6)
భద్రాద్రి కొత్తగూడెం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గత రెండురోజులుగా జరుగుతున్న 68వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర ఫుట్ బాల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు.
సెమీఫైనల్ చేరుకున్న ఆతిథ్య ఖమ్మం జట్టు.
68వ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలుర ఫుట్ బాల్ పోటీల్లో ఆతిథ్య ఖమ్మం జట్టు సెమీఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగిన పోటీలో 3-0 స్కోరుతో గెలుపొంది సెమీఫైనల్ చేరుకుంది. ఖమ్మం జట్టు తాము ఆడిన చివరి మ్యాచ్ లో మహబూబ్ నగర్ జట్టును గోల్స్ చేయకుండా నిలువరించడంలో సఫలం అయింది. ఉదయం నవభారత్ గ్రౌండ్ లో ఫూల్ -బి లో జరిగిన పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు వరంగల్ జట్టుపై 3 -0 స్కోర్ తో గెలుపొంది సెమీఫైనల్ చేరుకుంది. ఫూల్ -బి లో జరిగిన మరొక మ్యాచ్ లో మెదక్ జట్టు 1-0 స్కోరుతో కరీంనగర్ పై గెలుపొందింది. ఆదివారం ఉదయం రంగారెడ్డి మెదక్ జిల్లా జట్ల మధ్య పోటీ 1-1 గోల్స్ తో డ్రాగా ముగిసింది. సాయంత్రం ప్రకాశం గ్రౌండ్స్ లో జరిగిన చివరి మ్యాచ్ లో నిజామాబాద్ జిల్లా జట్టు ఆదిలాబాద్ జట్టుపై 2-1 స్కోరుతో గెలుపొందింది.
సోమవారం ఉదయం జరుగనున్న నాకౌట్ సెమీఫైనల్ పోటీల్లో మొదటి మ్యాచ్ మెదక్, ఖమ్మం జిల్లా జట్ల మధ్య, రెండవ మ్యాచ్ రంగారెడ్డి, నల్గొండ జిల్లా జట్ల మధ్య జరగనుంది. సోమవారం ఉదయం నాకౌట్ పోటీలు జరగనున్నట్లు ఎస్జీఎఫ్ నిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కె.సుందరమ్మ, బట్టు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, బి.యుగంధర్, శ్రీనివాస్, మంజీలాల్, సీతాదేవి, సుజాత, విద్యాసాగర్, రాష్ట్ర పరిశీలకుడు వడెన్న పాల్గొన్నారు.