ఏసీబీకి పట్టుబడిన జిల్లా అధికారి
కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఏసీబీ ఆపరేషన్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 18)
ఓ డ్రిప్ ఇరిగేషన్ సంస్థకు బిల్లుల చెల్లింపుల కోసం
రూ.1.14లక్షలు లంచం తీసుకుంటుండగా, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణను బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో పట్టుబడిన సూర్యనారాయణ వద్ద నుంచి రూ.1.14లక్షలను స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం… తాజాగా మంజూరు చేయాల్సిన సబ్సిడీతోపాటు గతంలో మహబూబాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు పర్సెంటేజీ(లంచం) కింద రావాల్సిన బకాయి కలిపి ఆయన డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక ఆ డ్రిప్ ఇరిగేషన్ సంస్థ వారు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీకి సమాచారం ఇచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు, ఆ రూ.1.14లక్షలు సూర్యనారాయణకు అందజేయగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు సూర్యనారాయణపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ రమేశ్ ప్రకటించారు.