భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
సూచనలు చేసిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 4)
భారీవర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన పేర్కొన్నారు. సెల్ఫీల కోసం వాగులు, వంకలు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని కోరారు. వరద నీటితో నిండిపోయిన రోడ్లు దాటడానికి ప్రజలెవరూ ప్రయత్నించవద్దని సూచించారు. వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయని, వాహనాల టైర్లు జారిపోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని తెలిపారు. కాబట్ట వాహనదారులు తమ వాహనాలతో నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతున్నందున ఆ పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు తప్పక పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారయంత్రాంగం సూచించిన సూచనల మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఏదైనా ప్రమాదం ఎదురైతే, ఆ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం తప్పని సరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.