“ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల’పై అసత్య ప్రచారం మానుకోవాలి
కులాల మధ్య చిచ్చుకు విషం చిమ్ముతున్న తీన్మార్ ఎమ్మెల్సీ పదవి రద్దుచేయాలి
✍️ హైదరాబాద్ – దివిటీ (ఆగస్టు 24)
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, రాజకీయ లబ్ధికోసం, తన సొంత మీడియాను అడ్డుపెట్టుకుని ఈడబ్ల్యుఎస్ 10శాతం రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలతో, కులాల మధ్య చిచ్చుపెడుతున్న తీన్మార్ మల్లన్న శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రెడ్డిసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన న్యూస్ ఛానల్ ద్వారా విషం చిమ్ముతున్నాడని ఆరోపించారు. 2019లోనే కేంద్రంలో ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లను పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించి అమలు చేస్తోందన్నారు. అలాంటి రిజర్వేషన్లపై అగ్రవర్ణ పేదలకు నష్టం కలిగించే విధంగా, వాస్తవాలకు విరుద్ధంగా, తనకు తెలిసినరీతిలో కులాల జనాభా కాకిలెక్కలు చెప్తున్నాడని విమర్శించారు. ఈ ఈడబ్ల్యుఎస్ గురించి వాస్తవాలు వక్రీకరిస్తూ, విషం చిమ్ముతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చట్టపరమైన చర్యలు తీసుకుని శాసనమండలి సభ్యత్వ పదవిని రద్దు చేయాలని, అప్పటివరకు ఆందోళన కొనసాగిస్తామని తిరుపతిరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి, కమ్మ, వైశ్య, క్షత్రియ, ముస్లింలతో పాటు దాదాపు 20 శాతం వరకు అగ్రవర్ణ కులాలు జనాభా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. కానీ దీనికి విరుద్ధంగా కేవలం 6.8శాతం మాత్రమే ఓసీ జనాభా ఉన్నట్లు తప్పుడు లెక్కలు చెబుతూ ఈడబ్ల్యుఎస్ పై, రిజర్వేషన్లపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 50ఎకరాల భూమి ఉన్నవాళ్లకి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు తీవ్ర అసత్యాలు మాట్లాడుతున్న తీన్మార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అనేవి ఐదు ఎకరాలలోపు భూములున్న వాళ్ళ కోసమే తప్ప, అతను చెప్పినట్లు 50 ఎకరాల ఆసాములకు కాదన్న కనీసజ్ఞానం లేకుండా మాట్లాడడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. ఈడబ్ల్యుఎస్ 10శాతం రిజర్వేషన్లు అనేవి కేవలం పేద రెడ్లకు మాత్రమే కాదని ముస్లింలతో పాటుగా బ్రాహ్మణ, వైశ్య, వెలమ, కమ్మ క్షత్రియ, కులాల్లోని పేదలకు వర్తించడానికి పార్లమెంట్లో ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన రిజర్వేషన్లు అనే విషయం మర్చి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, రాజకీయ లబ్దిపొందాలని దురుద్దేశంతో ఇలా తీన్మార్ మల్లన్న మాట్లాడడంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరముందని రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.