ఆనందం వెతుక్కుంటూ… అథఃపాతాళానికి…
‘పబ్’ల తనిఖీల్లో ఒక్కరోజే పట్టుబడిన 50మంది
యువతలో పెరుగుతున్న ‘డ్రగ్స్’ వినియోగం
ఆందోళన కలిగిస్తున్న హైదరాబాదీ జీవన విధానం
✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ (ఆగస్టు 18)
హైదరాబాదీల జీవన విధానం అస్తవ్యస్తంగా మారుతూ ఆందోళన కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని యువత అవకాశాలను వెతుక్కుంటూ ఆశగా బతికే హైదరాబాదు గడ్డ నేడు ‘డ్రగ్స్ బానిసల అడ్డా’గా మారే ప్రమాదంలో పడింది. ఓవైపు రోజురోజుకూ పెరుగుతూ పోతున్న గంజాయి అక్రమ రవాణా, మరోవైపు అనేక రకాల ‘డ్రగ్స్’తో అంతర్జాతీయ ముఠాల ఆగడాలతో ఈ ఆధునిక నగరం విలవిలలాడుతోంది. తెలంగాణ పల్లెలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో యువత అవకాశాల కోసం హైదరాబాదు నగరం బాట పడుతున్న విషయం తెలిసిందే. నగరంలో తెలంగాణ యువత 40శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత దాదాపు 30శాతం, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో 20 శాతం యువత ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాదు వస్తున్నట్లు అంచనా. వీరితో పాటుగా మరో 10శాతం వరకు ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఉంటారని తెలుస్తోంది. ఉపాధి, ఉద్యోగావకాశాలకు ఈ నగరం ఎంత అనుకూలంగా ఉంటుందో, అదేస్థాయిలో ఇతర ప్రాంతాల జీవన స్థితిగతులకు కూడా ప్రభావితం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆధునికత పేరుతో తీవ్ర మార్పులకు కూడా గురవుతున్నట్లు అర్థమవుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా యువత ‘పబ్ కల్చర్’ కు అలవాటుపడుతున్నారు. ‘ఐటీ ఉద్యోగావకాశాలు’ కూడా హైదరాబాదీలలో ఆధునిక జీవనశైలికి దారులు వేశాయి. ఫలితంగా ‘కాస్మోపాలిటన్ కల్చర్’ వేగంగానే విస్తరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత పబ్ లకు వెళ్లడం ఓ అలవాటుగా మార్చుకుని, ఆ కల్చర్ లోనే మరింత ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో మత్తుతో మనిషిని తాత్కాలిక ఆనందంలో ముంచెత్తి, ధీర్ఘకాలికంగా బానిసను చేసి, నిర్వీర్యం చేసి మరీ నిట్ట నిలువునా దహించివేసే ‘డ్రగ్స్’కు బానిసలవుతున్నారు.
ఆనందాన్ని వెతుక్కునే అడ్డా(పబ్)లే డ్రగ్స్ కేంద్రాలు?
పనివత్తిడిని మర్చిపోవాలనే పేరుతో కొందరు, జల్సా చేయాలనే సాకుతో మరికొందరు ఆనందం వెతుక్కునే ‘అడ్డాలు’గా మారిన పబ్ లు డ్రగ్స్ కేంద్రాలుగా మారి పోతున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చిన్నా, పెద్దా మొత్తం కలుపుకుని దాదాపు 600పైగా ‘పబ్’లు ఉన్నట్లు అంచనా. అధికారిక లెక్కల ప్రకారం మాత్రం 150 వరకు ఉన్నాయి. ఈ లెక్కలు కూడా వేగంగానే మారిపోతున్నాయి. సాధారణంగానే బడాబాబులుతో పాటుగా, ఎగువ మధ్యతరగతి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్న ‘పబ్’లలో మత్తుకోసం ఆరాటపడే యువతను ‘డ్రగ్ పెడ్లర్లు’ టార్గెట్ చేస్తున్నారు. మానసిక బలహీనతలతో ఆనందాలను కోసం వెతుక్కునేవారిని సులువుగా గుర్తించడంకోసం పబ్ లను ‘డ్రగ్ పెడ్లర్లు’ టార్గెట్ చేస్తున్నారు. కస్టమర్లను అత్యంత సులువుగా చేరుకునేందుకు కూడా ‘పబ్’లు దారి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చీకటి దందాలకు చిరునామాలుగా మారిపోతున్నాయి. హైదరాబాదులో పలు ‘పబ్’లలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పోలీసులు 12బృందాలుగా విడిపోయి ‘జూబ్లీహిల్స్’లో శనివారం రాత్రి తనిఖీలు చేయగా ఏకంగా 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘పబ్’లలో అనుమానితులకు ‘స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కిట్ల’ తో పరీక్షలు నిర్వహించిన పోలీసులు 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం డ్రగ్స్ నిరోధంపై తీవ్ర చర్యలకు ఉపక్రమించినప్పటికీ, పూర్తిస్థాయిలో మాత్రం ‘డ్రగ్స్’ను నిరోధించలేని దుస్థితి నెలకొందని పలువురు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గంజాయి, మరోవైపు ఇతర రకాల ‘డ్రగ్స్’ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ తరచుగా ‘పబ్స్’ లో డ్రగ్స్ పట్టుబడుతుండటం గమనార్హం. పబ్స్ లో డ్రగ్స్ పట్టుబడిన క్రమంలో పబ్ యాజమాన్యాలను పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నప్పటికీ, పరిస్థితులలో మార్పులేదంటే, “డ్రగ్ ఫ్రీ హైదరాబాద్”కోసం మరింతగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం అవసరమని ‘సోషల్ ఇంజినీరింగ్’ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ అడుగు ముందుకేసి ‘డ్రగ్స్’ నిరోధం కోసం ప్రత్యేకంగా ఓ ‘పోలీసు వ్యవస్థ’ను ఏర్పాటుచేసిన ప్రభుత్వం మరింత గట్టిగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు.