కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం రాయల చంద్రశేఖర్
సంస్మరణసభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు, పౌరహక్కుల నాయకులు
✍️ ఖమ్మం – దివిటీ (జులై 28)
ఐదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో ఎన్నో తుపాకీ తూటాలను ధిక్కరించి, పోలీసుల చిత్రహింసలు, జైలు నిర్బంధాలను ఎదుర్కొని, ప్రజాపంథా మార్గంలో ప్రజలను నడిపించి విప్లవోద్యమానికే వన్నె తెచ్చిన వ్యక్తి రాయల చంద్రశేఖర్ అని పలువురు కమ్యూనిస్టు నాయకులు, వక్తలు తెలిపారు. భూస్వామ్య లక్షణాలు కలిగిన పెట్టుబడిదారీవ్యవస్థను కూల్చి ,దోపిడీ, పీడన, అసమానతలు లేని సమ సమాజ స్థాపన కోసం జరిగే ప్రజా ,విప్లవ పోరాటంలో చిరస్మరణీయుడని, అరుణ పతాక రెపరెపల్లో చంద్రశేఖర్ కృషి వర్ధిల్లుతుందన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్సార్ గార్డెన్ లో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కె.రమ అధ్యక్షతన రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ, రాయల చంద్రశేఖర్ 17, 18 సంవత్సరాల యవ్వనం నుంచి మరణించే 68ఏళ్ల దాకా విప్లవోద్యమంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఉన్నారని గుర్తుచేశారు. పార్టీ ఉన్నతస్థాయికి ఎదిగిన ఆయన సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ హోదాలో కొసాగుతూ మరణించారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగపోరాట కాలం నుంచి నేటి విప్లవోద్యమం వరకు ఆయన కుటుంబం అంతా ప్రజల కోసం అంకితమై పనిచేయడం గొప్ప విషయమన్నారు. విప్లవోద్యమ అగ్రనేత, 5 దశాబ్దాలు అజ్ఞాత జీవితం గడిపిన రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అడుగు జాడల్లో రాయల చంద్రశేఖర్ నడిచారని గుర్తు చేశారు.
ఎర్ర జెండాకు ఔన్నత్యం తెచ్చిన ఆయన పోరాటం సదా స్మరించదగినవని, అందరికీ మార్గదర్శకమని, రాయల చంద్రశేఖర్ జీవితకాలంలో విప్లవోద్యమ అరుణపతాక కింద చేసిన కృషిని ప్రజలంతా కొనసాగించాలని కోరారు. ఈ సంస్మరణ సభలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల కన్వీనర్ విమలక్క, నాయకురాలు నిర్మల, ఓపీడీఆర్ జాతీయ కార్యదర్శి భాస్కరరావు, రైల్వే యూనియన్ రాష్ట్ర నాయకులు మర్రి యాదవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీమన్నారాయణ, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్, చిన్న చంద్రన్న, కెచ్చల రంగన్న, వి.ప్రభాకర్, ఎం.కృష్ణారెడ్డి, గోకినపల్లి వెంకటేశ్వర్లు,తదితరులు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ,సంతాప సందేశాలిచ్చారు. ఇతర సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు సంతాప సందేశం పంపించి, జోహార్లర్పించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు రాయల చంద్రశేఖర్ ను స్మరిస్తూ రాసి, పాడిన విప్లవ గేయాలు పార్టీ కార్యకర్తలను కంటతడి పెట్టించాయి. కార్యకర్తలంతా “ఒత్తుకుంటాం కంటతడిని- ఎత్తుకుంటాం ఎర్రజెండాను” అంటూ నినాదాలు చేస్తూ రాయల చంద్రశేఖర్ కు విప్లవ జోహార్లు అర్పించారు.