ముంపు బాధిత గ్రామాలను కాపాడాలని ధర్నా
బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి
✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 23)
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పరివాహకప్రాంతంలో లోతట్టు గ్రామాలకు వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోరుతూ రాజకీయ అఖిలపక్షం ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలకేంద్రం అంబేద్కర్ సెంటర్లో మంగళవారం నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ముంపుప్రాంతాలు కాపాడాలని, శాశ్వత పరిష్కారం చూపించాలని నినదిస్తూ నిరసన తెలియజేసి, తహసిల్దారుకి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బిజ్జం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కె.వి రమణ, సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, తదితరులు మాట్లాడారు. కరకట్టల నిర్మాణం చేయాలని, లేదంటే పోలవరం ప్యాకేజీతో బాధిత ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. గోదావరి వరదల కారణంగా వ్యాపారస్తులు, రైతులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేస్తూ, బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. 2022లో మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి, ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని మాటిచ్చిన నేటి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన ముంపు బాధితుల ఘోడు పట్టించుకునే నాధుడే కరవయ్యారని విచారం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కరించే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. ఈ బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిడిపి నాయకుడు తాళ్లూరి జగదీష్, వర్తకసంఘం నాయకుడు లక్కోజు విష్ణు, కొనకంచి శ్రీనివాసరావు, చుక్కపల్లి బాలాజీ, భూపల్లి నరసింహారావు, వలదాసు సాలయ్య, శ్రీనివాసగౌడ్ , దామర శ్రీను, భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు, పలువురు ఆటో యూనియన్ నాయకులు, రైతులు, యువకులు పాల్గొన్నారు.