పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి
సోమవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభం
✍️ ఖమ్మం – దివిటీ (జులై 20)
బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో కూసుమంచి పట్టణంలో తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కూసుమంచి మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నియోజకవర్గవ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించడం, చెక్ డ్యాముల ఏర్పాటు, అదే విధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంత్రి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి చొరవతో ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచే కళాశాల అందుబాటులోకి రావాలని ఆ జీఓలో పేర్కొన్నారు. ఈనెల 22(సోమవారం) నుంచి విద్యార్థినీ, విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కూసుమంచిలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు వల్ల నియోజకవర్గంలోని నిరుపేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన విద్యాభ్యాసం అందుకునే అవకాశం లభించింది. ఈమేరకు పాలేరు నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు.