సిగ్గు.. సిగ్గు.. ఇవేం మీడియాలు..ఇవేం డిబేట్లు?
జర్నలిజాన్ని బ్రష్టుపట్టిస్తున్న బద్మాష్‌గాళ్లు…
పెద్ద మీడియాలని చెప్పుకుంటూ చిల్లర ప్రసారాలు
నీతినియమాలు లేకుండా చర్చలు..లైవ్‌లు
గతితప్పిన మీడియాల్ని కలంతో కడిగేయాల్సింద
✍️ (కె.ఆర్)
మీడియాలది ప్రజాస్వామ్యానికి కావలి పాత్ర. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. అందుకే మీడియాని ‘ఫోర్త్ ఎస్టేట్’గా పిలుస్తారు. అంతటి మహోన్నతమైన మీడియా నేడు కొందరి మూలంగా గతితప్పింది. కొన్ని అగ్రశ్రేణి మీడియాలుగా చెలామణి అవుతున్న వాటికి చీకటి-వెలుగు, మంచి-చెడులకు తేడా తెలియకుండా పోయింది. కనీస జర్నలిజం విలువలు పాటించకుండా తమ ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్మాదంగా ప్రవర్తించడంపై సభ్యసమాజం ఛీకొట్టే పరిస్థితి దాపురించింది. తాము ‘రాసిందే నిజం..తాము చూపిందే రాజ్యాంగం…’ అనే తరహాలో కొన్ని మీడియాలు తమకు అనుకూల పార్టీలకు తొత్తులుగా మారాయి. అసలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే ఇప్పుడున్న అగ్రశ్రేణి మీడియాలుగా చెలామణి అవుతున్నవాటిల్లో మూడొంతులు పార్టీ మీడియాలే. రాజకీయ పార్టీలకు మీడియాలుంటే తప్పుకాదు కావచ్చు. కానీ తమ ప్రత్యర్థి పార్టీలను, నాయకులను ఇంగితం మరచి రాజకీయంగా దెబ్బతీస్తాం… ‘కడుక్కోలేని విధంగా బురద పూస్తాం…’ అనే ఉన్మాదానికి దిగజారడాన్ని తప్పుపట్టాల్సిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అగ్రశ్రేణి మీడియాలమంటూ జబ్బలు చరుచుకునే మీడియాల భాష… చూపెట్టే ప్రసారాలు… ఎంచుకున్న డిబేట్లు పూర్తిగా కల్లు కాంపౌండ్‌లు, సారా బట్టీల స్థాయికి దిగజారిందని చెప్పడానికి సిగ్గుగా ఉంది. మన ప్రసారాలు, రాతలు సమాజం మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయనే విషయాన్ని మరచిన కొందరు జర్నలిస్టులు వివిధ టీవీల్లో చర్చల పేరిట నేడు చూపెడుతున్న విషయాలు సమాజానికి చేటు కల్గించేవే. ప్రభుత్వలోపాలను సరిచేసుకునే విధంగా ప్రజాసమస్యలే ప్రధాన అజెండాగా ఉండాల్సిన ఆ మీడియాలు కేవలం ఓ మహిళ శీలాన్ని పరీక్షించడానికి రోజుల తరబడి ఉపయోగిస్తున్నాయంటే ఇవి ఏ తరహా మీడియాలో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్నపిల్లలను, మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా మాట్లాడటం చూశాం. ఆ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సదరు యూట్యూబర్‌పై కేసు నమోదై కటకటాలపాలైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన మరవకముందే ఏపీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ విషయాన్ని మీడియాలో రచ్చరచ్చ చేస్తున్న కొన్ని మీడియాల దిగజారుడు వ్యవహారంపై ప్రజలు ఛీకొడుతున్నారు. దేశంలో ఏ సమస్యలు లేవన్నట్లు ఓ రాజకీయ నాయకుడికి సదరు మహిళా ఉద్యోగితో సంబంధాన్ని అంటగడుతూ రోజుల తరబడి చర్చలు చేయడం ముమ్మాటికీ నీతి తప్పిన జర్నలిజమే. ఈ విషయంలో ఓ రాజకీయ నాయకుడిని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఓ వర్గం మీడియా సదరు మహిళా ఉద్యోగిపై అసభ్య చర్చలు చేయడంతోపాటు ఆమె పరువును పూర్తిగా బజారున పెట్టి, ఆమె గౌరవాన్ని అత్యంత హీనంగా కించపర్చే చర్యలకు పూనుకోవడం ఖండించాల్సిందే. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మీడియాలే కొద్ది రోజుల క్రితం ఆడపిల్లలను కించపరుస్తూ ఓ యూట్యూబర్ డార్క్ కామెడీ చేశాడని నానా రాద్ధాంతం చేశాయి. సదరు యూట్యూబర్‌కి ఉరిశిక్ష వేయాలనే తరహాలో చర్చలు చేపట్టడం మరింత విశేషం. సరిగ్గా వారం తిరగకముందే ఓ గిరిజన మహిళ ఇంటి విషయాన్ని సభ్యసమాజం సిగ్గుపడేలా చర్చలు చేస్తూ ఆ మహిళ పరువును నడిబజార్లోకి తీసుకొచ్చింది ఈ మీడియాలే… ఈ మీడియాలో పనిచేసే జర్నలిస్టులే… మరి ఇప్పుడు వీరికి ఏ రకం శిక్షలు వేసుకుంటారో వారికే తెలియాలి. ఇక కొన్ని ప్రధాన మీడియాలు తమ ప్రసారాలకు, డిబేట్లకు, లైవ్ ప్రోగ్రాంలకు పెట్టుకునే హెడ్డింగ్‌లు, థంబ్‌నెయిల్స్ పూర్తిగా దిగజారిపోయి ఉంటున్నాయి. 15 సంవత్సరాల క్రితం దాదాపు అన్ని మీడియాలు, పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు ఓ ప్రధాన పాఠంగా అక్కడి సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు నేర్పేవారు. ఒక్క పదం కూడా బూతు ఉండరాదనే ఆంక్షలు ఉండేవి. ఉదాహరణకు పసుపుకు మద్దతు ధర ఎక్కడ? అని రాయాల్సి వచ్చే సందర్భంలో పసుపుకు అనే పదంలో చిన్న బూతర్థం దొర్లుతుందనే కారణంతో ‘పసుపునకు’ మద్దతు ధర ఎక్కడ? అని తప్పక మార్చి రాయించేవారు. ఇదీ నాటి జర్నలిజం స్థాయి… నాటి పాత్రికేయ విలువల గొప్పతనం. కానీ నేడు ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని ‘అరెయ్..ఒరేయ్… నీకు దమ్ముందా… మొగోడివా… తూ..నీ బతుకు…’ ఇలా రాయలేని బూతులను హెడ్డింగులుగా, థంబ్‌నెయిల్స్‌గా పెడుతూ అగ్రశ్రేణి మీడియాలని గొప్పలు చెప్పుకుంటున్నాయి. పైగా ఇలా పూర్తిస్థాయిలో బూతు మీడియాలుగా మారి పార్టీ పత్రికలుగా ఉండి పైగా తమదే అగ్రశ్రేణి అంటూ ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయలను ప్రకటనల రూపంలో కొల్లగొడుతున్న దగుల్బాజీ మీడియాల రాక్షసత్వం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓ పక్క పూర్తిగా పార్టీ మీడియాలుగా ఉంటూ పార్టీ చొక్కాలు కప్పుకున్న కార్యకర్తల్లా వార్తలు చదువుతూ… డిబేట్లు చేస్తూ… అక్రమ పద్ధతుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి చివరికి అక్రిడేషన్లు అనే బూచిని చూపెట్టి ప్రభుత్వాలు పేద జర్నలిస్టులకు ఇచ్చే ఇండ్లజాగాలను కూడా కొట్టేసిన కేటుగాళ్ల గురించి ఇకనైనా పాత్రికేయలోకం గుర్తించకపోతే యావత్ పాత్రికేయం మనుగడకే ప్రమాదం పొంచి ఉన్నది. కొందరు దగుల్బాజీ మీడియాల గుట్టు తెలిసి కూడా ప్రభుత్వాలు మీడియా వ్యవస్థలో కనీస మార్పులు తీసుకరావడానికి ప్రయత్నించకుండా ఇలాంటి చీకటి మాఫియాల మీడియాలకు వంగి వంగి సాగిలపడటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలతో నిఖార్సయిన పాత్రికేయులు నేడు నడిరోడ్డున ఉన్నారు. కనీసం కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో ఉండటం చూసి పాలకులు తలదించుకోవాలి. కనీసం పేదల కోటాలోనైనా సామాన్య, మధ్యతరగతి, పేద జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇవ్వమంటే చీమకుట్టినట్లైనా చలనం లేని ఈ పాలకులను ఏం అనాలి?… ఏ కలంతో కడిగేయాలి…?అందుకే తాజాగా తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ముట్టడులకు కనీసం ప్రాధాన్యం ఇవ్వకుండా ఏపీలో ఓ మహిళా ఉద్యోగి గర్భాణికి కారకులెవరు? అనే అంశం మీద రోజుల తరబడి చర్చ పెట్టడంపై ఓ ఉద్యమకారుడు ఓ వీడియోలో చెప్పిన మాటలు వాస్తవ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి పోరుబాట పడితే ఈ సమస్య మీకు కళ్లకు కనబడలేదా? తెలంగాణలో స్టూడియోలు నిర్మించుకుని ఉంటూ ఏపీలో ఓ మహిళ ఉద్యోగి గర్భాణికి కారకులెవరు? అనే ఇంటి విషయాన్నే రోజుల తరబడి చూపెడుతున్నారే… అసలు మీకు సిగ్గుందా? తూ… మీ బతుకులు… అంటూ రాయలేని భాషలో సదరు ఉద్యమ కారుడు ఆ వీడియోలో ఆవేదన చెందడం నిజంగా ఆలోచించదగ్గ విషయమే. అదేవిధంగా మరో మహిళ విషయంలో ఓ ఛానెల్లో ఓ సీనియర్ జర్నలిస్టు ఏవో పిచ్చి మాటలు మాట్లాడితే సదరు టీవీ యాక్టర్ ప్రతిస్పందనగా పర్సనల్ విషయాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే చెప్పుతో కొడతా అని వీడియో చేసి వార్నింగ్ ఇవ్వడం చూస్తే కొన్ని మీడియాల పెడమార్గాలను అర్థం చేసుకోవచ్చు. వ్యూస్, సంచలనాలు, డబ్బుల కోసం అనైతిక తోవలు వెతుకుతూ పవిత్ర పాత్రికేయ వృత్తిని సర్వనాశనం చేస్తున్న కొన్ని మీడియాలు, కొందరు జర్నలిస్టుల సిగ్గులేని నైజాన్ని కలంతో కడిగేయాల్సిందే… జనం తెలుసుకునేదాకా పోరాడాల్సిందే…
మానసాని కృష్ణారెడ్డి (సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్)
9618616110