ఆగస్టులో గోదావరి జలాలు వైరా రిజర్వాయరుకు తరలించే ప్రయత్నం



పదిలక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యం : మంత్రి తుమ్మల
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 9)
ఆగస్టు నెలలో గోదావరి జలాలను ఏన్కూరు లింకు కాలువ ద్వారా వైరా రిజర్వాయరుకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ములకలపల్లి మండలం పూసుగూడెం పంపుహౌస్ ను మంగళవారం ఆయన పరిశీలించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు పంపుహౌస్ పనుల వివరాలు మంత్రికి వివరించారు. ట్రయల్ కోసం సిద్ధంగా ఉన్న మోటార్లు పరిశీలించిన అనంతరం తుమ్మల మాట్లాడుతూ, పంపుహౌస్ లో అమర్చిన మోటర్లు చైనా షాంగై కంపెనీ తయారీవని, ఆ కంపెనీ ఇంజనీర్లు వచ్చిన అనంతరం పంపుహౌస్ ట్రయల్ నిర్వహిస్తామని తెలిపారు. చైనా ఇంజనీర్లు త్వరగా వచ్చేందుకు చైనాతో సంప్రదిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చైనా ఇంజనీర్ల సమక్షంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు నెలలో గోదావరి జలాలను ఏన్కూరు లింకు కెనాల్ ద్వారా వైరా రిజర్వాయరుకు తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ కు కృష్ణాజలాలు ఆలస్యమైనా వైరా, నాగార్జనసాగర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఆయకట్టుతోపాటు మధ్యలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ గోదావరి జలాలను పంపించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.
పంపుహౌస్ లో పంపులు బిగించి నాలుగేళ్లయినందున ఈ ఏడాది తప్పనిసరిగా ట్రయల్ రన్ పూర్తిచేయకపోతే పంపులకు కూడా ప్రమాదమని నిపుణులు సూచించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. ఏన్కూరు టన్నెల్, లింకుకెనాల్ ను అత్యవసర ప్రాతిపదికన సీఎం నుంచి అనుమతితో ఈనెలలో పూర్తి చేయబోతున్నామని తెలిపారు. టన్నెల్ వరకు 104కిలోమీటర్ల కెనాల్ 97 శాతం పూర్తయిందని, కేవలం మూడు శాతం లైనింగ్ పనులే పెండింగులో ఉన్నాయని, అవి కూడా ఈ సీజన్ తర్వాత పూర్తిచేస్తామని తెలిపారు. గోదావరి జలాలతో ఈ మూడు పంపుహౌస్ లు వినియోగించుకోవడంతో పాటు సాగర్ ఆయకట్టుకు, వైరా, లంకాసాగర్ లకు ఈ సంవత్సరం గోదావరి జలాలు తరలిస్తామని తెలిపారు. వచ్చే సీజన్ నాటికి యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తిచేసి సత్తుపల్లి,అశ్వారావుపేట నియోజకవర్గాలకు నీరందిస్తామని తెలిపారు. రూ.13,500కోట్లతో పనులు మొదలు పెట్టి ఇప్పటివరకు రూ.7800 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఈ పంపు హౌస్ లు వినియోగించుకుని ఖమ్మంజిల్లాలో దాదాపు 7లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ ఆయకట్టు మరో 3 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరందించటమే తనతోపాటు ప్రజల కోరిక అని మంత్రి తెలిపారు.
ఇల్లందు నియోజకవర్గానికి గోళ్లపాడు నుంచి నీరిచ్చే పనులకుఅటవీ అనుమతులు లభించకపోవడం వల్ల సాధ్యపడలేదని తెలిపారు. ప్రత్యేకశ్రద్ధతో గోదావరి జలాలు ఇల్లందు నియోజకవర్గానికి తరలిస్తామన్నారు. గోదావరి పైభాగంలోని ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా భద్రాచలం నియోజకవర్గంలో తాలిపేరు ప్రాజెక్టు ఉన్నప్పటికీ దుమ్ముగూడెం మండలంలోని 30 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తుమ్మల తెలిపారు. దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి కొత్తగా లక్ష ఎకరాల చొప్పున సేద్యంలోనికి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. వైరా ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు ఉన్నందువల్ల సాగర్ నీరు రాకపోయినా గోదావరి నదీ జలాలతో తాగు, సాగునీటి అవసరాలు తీర్చుకునే అవకాశముందని తెలిపారు. ఇంజనీర్ పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈనెలలోనే ఈ మూడు పంప్ హౌస్ ల ట్రయల్ రన్ పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ సీఈ ఎ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ ఎస్. శ్రీనివాసరెడ్డి, ఈఈ కె సురేష్ కుమార్, ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.