దమ్మపేట ఆర్ఐ జబ్బా ఎర్రయ్యపై సస్పెన్షన్ వేటు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 3)
ఓ వ్యక్తికి ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసి, ఆ డబ్బులు ఫోన్ పే ద్వారా తీసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
దమ్మపేట మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మీనారాయణరెడ్డి తన కుటుంబ సభ్యులకు నివాస ధ్రువీకరణపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ధ్రువీకరణపత్రం జారీ చేసేందుకు రూ.10వేల లంచం అడిగిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ జబ్బా ఎర్రయ్య, ఫోన్ పే ద్వారా ఆ డబ్బులు తీసుకున్నట్లు సదరు బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ దమ్మపేట తహసిల్దారుతో చేయించిన ప్రాథమిక విచారణలో ఆర్ఐ జబ్బా ఎర్రయ్య లంచం తీసుకున్నట్లు నిరూపణ అయింది. దీనిపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ ఎర్రయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.