విపత్కర పరిస్థితుల్లో సేవలకు డీడీఆర్ఎఫ్ సిద్ధం : ఎస్పీ
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 3)
ఈ వర్షాకాలంలో జిల్లాలో నదులు, వాగులు, వంకలు పొంగి విపత్కర పరిస్థితులెదురైనప్పుడు జిల్లా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున “డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీడీఆర్ఎఫ్)” సిద్ధంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. వర్షాలెక్కువ కురిసినప్పుడు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమలయమై అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం అందితే వెంటనే డీడీఆర్ఎఫ్ బృందం వచ్చి సేవలు అందిస్తుందని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని కాపాడే విధంగా డీడీఆర్ఎఫ్ బృందం సభ్యులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందారని ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్తితులు ఎదురైనా వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమందిస్తే వెంటనే డీడీఆర్ఎఫ్ అక్కడికి చేరుకుని తగు సహాయకచర్యలు చేపడుతుందని తెలిపారు. డీడీఆర్ఎఫ్ బృందానికి రెస్క్యూ సమయంలో కావలసిన అన్నిరకాల సామగ్రిని అందజేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు డీడీఆర్ఎఫ్ బృందంలో సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్, ఆర్ఐ ఆపరేషన్స్ రవి, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఎంటీఓ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.