క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు 21 నుంచి మండలస్థాయి ఎంపికలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్15)
హకీంపేటలో తెలంగాణా క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా నడపబడుతున్న తెలంగాణా స్పోర్ట్స్ స్కూల్(క్రీడా పాఠశాల)లో 4వ తరగతిలో ప్రవేశాలకోసం మండల స్థాయిలో ఈనెల 21నుంచి 25లోపు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన, క్రీడల అధికారి కె సంజీవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించనున్న ఈ మండలస్థాయి ఎంపికల వివరాల కోసం సంబంధిత మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. మండలస్థాయి ఎంపికలకు హాజరయ్యే బాల బాలికలు తప్పకుండా తమ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు (ఒరిజినల్), ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి పొందిన వయస్సు, విద్యార్హత సర్టిఫికెట్, ఎంఆర్ఓ / పంచాయత్ / మున్సిపాలిటీ/ కార్పొరేషన్ నుంచి పొందిన పుట్టినతేదీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టులు, కమ్యూనిటీ సర్టిఫికేట్, 10పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరిగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మండలస్థాయిలో ఎంపికైన బాలబాలికలకు జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి, రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపించనున్నట్లు సంజీవ రావు వెల్లడించారు.