సామాన్యులకు అందుబాటులో ధరణి పోర్టల్
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు
ధరణితో లక్షల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయన్న మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ
సిద్ధమవుతున్న ధరణి కమిటీ నివేదిక
✍️ హైదరాబాదు – దివిటీ మీడియా (జూన్ 14)
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నాయని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. శుక్రవారం హైదరాబాదులో డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాసరెడ్డి ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, ఎం.సునిల్ కుమార్, మధుసూదన్ లతో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత స్వయంగా తాను ఖమ్మంజిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ సమస్యల నుంచి రైతు సోదరులకు ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ ను పునర్ వ్యవస్థీకరించి భూముల వ్యవహారాలకు సంబంధించిన చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా, ఎంతో హడావిడిగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలెదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూలోని ‘ధరణి’ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని, ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలపై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీ చేసిన సిఫారసులపై ప్రస్తుత సమావేశంలో సుధీర్ఘంగా చర్చించామని, ఈ కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించే ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ధరణి కమిటీ రాష్ట్రంలో ఉన్న భూ వ్యవహారాల నిపుణులు, అధికారులతో చర్చించడంతోపాటు 18 రాష్ట్రాలలోని ఆర్ఓఆర్ యాక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. భూవివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటుచేయాలని, భూమికి సంబంధించి ముఖ్యమైన చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. లోపభూయిష్టమైన 2020ఆర్ఓఆర్ చట్టం, తద్వారా రూపొందించిన ధరణి పోర్టల్ బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్ లో మార్పులు-చేర్పులు చేపట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బి లో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.