మండువేసవిలో గొంతెండుతున్న ఆదివాసీలు
చెరువుసింగారానికి పదిరోజులుగా మంచినీరు బంద్
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం
✍️ బూర్గంపాడు – దివిటీ మీడియా (మే 23)
మండుతున్న ఎండల్లో తమ గొంతెండిపోతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని చెరువుసింగారం ఆదివాసీలు. ముసలిమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువుసింగారం గ్రామంలో మిషన్ భగీరథ మంచినీళ్ల పైపులైను పగిలిపోయి పది రోజుల క్రితం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయి ఆ గ్రామస్తులంతా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ట్యాంకుకు నీటిసరఫరా చేస్తున్న పైపులైను గ్రామ సమీపాన పగిలిపోయి నీరంతా అడవిలో వృధాగా పోతోంది. మరోపక్క ఆ గ్రామం మొత్తం తాగునీటికోసం అల్లాడుతోంది. సమస్య మొదలై 10 రోజులైనా గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామస్తులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సమాధానం కూడా చెప్పడం లేదని వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆయన గురువారం పైపులైను పగిలిన ప్రాంతాన్ని సందర్శించారు. మంచినీళ్లు రావడంలేదని, పైపులైను పగిలిపోయిందని చెప్పితే మంచినీరు వృథా కాకుండా వాల్వ్ బంద్ చేశారే తప్ప ఆ గ్రామానికి మళ్లీ మంచినీళ్లు ఇద్దామనే సోయి అధికారులకు లేదంటూ ఆయన విమర్శించారు. ఆ పైపులైనుకు మరమ్మతులు చేసి, వెంటనే చెరువుసింగారం గ్రామస్తులకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు, జిల్లాకలెక్టర్ జోక్యం చేసుకోవాలని, మంచినీళ్లు లేక పది రోజులుగా గ్రామప్రజల గొంతెండి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్ప సత్యనారాయణ, రత్నకుమార్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

