పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (మే 22)
వరంగల్- ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి ఎన్నికల సంఘం కల్పించిన ఓటుహక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐడీఓసీ కార్యాలయం రూమ్ నెంబర్ ఎఫ్-7లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఆ సెంటర్లో ఉద్యోగులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో మే నెల 24 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్హులందరూ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 70 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారని కలెక్టర్ డా.ప్రియాంకఅల వెల్లడించారు.
—————————
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్
—————–
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకలెక్టర్, రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తోపాటు, ఉప ఎన్నికలు జరిగే 12 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఆదనపు కలెక్టర్లు, ఏఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎన్నికలసంఘం సరఫరా చేసిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్, ఇండెలిబుల్ ఇంకులు మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిసినందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చేతి మధ్య వేలుకు ఇండెలిబుల్ ఇంక్ మార్కు చేయాలని సూచించారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శించాలని, అదేవిధంగా ఓటర్లు ఓటు ఎలా వేయాలనే అంశాలను తెలిపేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల మాట్లాడుతూ, శాసన మండలి పట్టభద్రుల ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఎన్నికలసిబ్బందికి శిక్షణతరగతులు నిర్వహించామని, పోలింగ్ నిర్వహణ పనులు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించామని తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని, సిబ్బందికి అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చామని తెలిపారు. సిబ్బంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాట్లన్నీ పూర్తిచేశామని తెలిపారు. ఈనెల 27న నిర్వహించే పోలింగ్ కు నిబంధనలకనుగుణంగా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ డా.ప్రియాంకఅల, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నారు. ఆర్టీఓలు మధు, దామోదర్ రావు, జిల్లా ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ దారా ప్రసాద్, నవీన్, తదితరులు కూడా పాల్గొన్నారు.