ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 8)
జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటుహక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల పిలుపునిచ్చారు. ఈ మేరకు
డీఆర్డీఓ, డీడబ్ల్యుఓ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ఓటర్ల ఛైతన్య కార్యక్రమం (స్వీప్ ప్రోగ్రాం)లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలందరితో ఓటుహక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని గుర్తించి అర్హులైన మహిళలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా, మెరుగైన భవిష్యత్తుకోసం సమర్థులైన నాయకులకు ఓటు వేయాలని ఆమె సూచించారు. అందుకే పోలింగ్ రోజైన మే13 సెలవుదినంగా ప్రకటించినట్లు చెప్పారు. తాము కచ్చితంగా ఓటు వేయడంతోపాటు అర్హులైన ఇతరులు కూడా ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూలస్తంభాలని ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా100 మంది మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, మెప్మా మహిళలు, ఐసీడీఎస్, ఐడీఓసీలోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనరాణి, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం పోటీలలో గెలిచిన, పోటీలో పాల్గొన్న అభ్యర్థులను కలెక్టర్ అభినందించి, బహుమతులు ప్రదానం చేశారు.
మొదటి విజేతలుగా ఎం.రాజేశ్వరి, అఖిల, శృతి, రెండవ విజేతలుగా నాగలక్ష్మి, పుష్పలత, కావ్య, మూడవ విజేతలుగా ఉమా, రజిత, ఉషారాణి, కావ్య, ప్రోత్సాహక విజేతలుగా స్వరూప, అమల, శ్రీకళ, నాగజ్యోతి, రాజ్యలక్ష్మి బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ విజేత, పరిపాలనాధికారి గన్యా, మెప్మా పీడీ రాజేష్, డీఆర్డీఏ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.