కార్యకర్తలకు వెన్నంటే ఉంటా : వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్
వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే
రాములునాయక్ వెంటే ఎప్పుడూ తమ ప్రయాణమన్న కార్యకర్తలు
✍️ దివిటీ మీడియా – వైరా, ఏప్రిల్ 22
తనను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, కార్యకర్తలకు అండగా వెన్నంటే ఉంటానని వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములునాయక్ స్పష్టం చేశారు. సోమవారం వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములునాయక్
నివాసంలో ఏన్కూర్ మాజీ మండల అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ, వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి చరిత్ర సృష్టించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 2018 ఎన్నికల్లో నేను ఓడించిన వ్యక్తినే 2023 మళ్లీ పార్టీ బీఫామ్ ఇచ్చారని, అయినా పార్టీకి కట్టుబడి ఉండాలనే సంకల్పంతో ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ‘అయినా రెండో దఫా ఓడిపోయిన వ్యక్తిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా నియమించడం ఎంతవరకు సబబు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగా అత్యవసరంగా పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ పరిస్థితికి కార్యకర్తలంతా తనను క్షమించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలతోనే తన ప్రయాణం సాగిస్తానని, వారి వెంటే ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకుంటూ ముందుకు వెళ్తానని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు రోజులు మనవేని కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ, ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు మాట్లాడుతూ, నియోజకవర్గవ్యాప్తంగా తమ గుర్తు, తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కే అని ముక్తకంఠంతో తెలియజేశారు. రాములునాయక్ అడుగుజాడల్లోనే తామంతా ఉంటామని, ఆయన తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీసుకుంటారని ఎదురు చూసి నిరాశ చెందామని, ఇప్పటికైనా సరైన మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. రాములునాయక్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, నాటి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని, స్వచ్ఛమైన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన మంచి మనిషని, అంతటి మంచి మనిషైనా
మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ ను బిఆర్ఎస్ పార్టీ అడుగడుగునా అవమానపరిచిందని గుర్తు చేసుకుని, సింగరేణి ఎంపీపీ మాలోత్ శకుంతలతోపాటు పలువురు కార్యకర్తలు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, సింగరేణి ఎంపీపీ మాలోత్ శకుంతల, జూలూరుపాడు ఎంపీపీ లావుడియా సోని, ఏన్కూర్ మాజీ మండల అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, సింగరేణి మాజీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, కో ఆప్షన్ సభ్యులు ఎండి అనీఫ్, ఎస్.కె బీబా, మాజీ సర్పంచులు మాలోత్ కిషోర్, లావుడియా కిషన్, భూక్య సైదా,బానోత్ కుమార్, ఏన్కూరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ భూక్య చందులాల్, సుడా మాజీ డైరెక్టర్ బండారి కృష్ణ, దిశా కమిటీ మాజీ సభ్యుడు కుమార్, మార్కెట్ డైరెక్టర్ నరేష్ నాయక్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, మాజీ ఉపసర్పంచ్ భూక్య చాందిని, నాయకులు తడికమల్ల నాగేశ్వరరావు, మెరుగు రత్నరాజు, జూపల్లి రాము, షఫీ, రవీందర్, బిక్షం, దేవేందర్, చందు, రామారావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.