ఇంజినీరింగ్ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయకపోతే చర్యలు
పనుల తీరుపై సమీక్షించివ ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍️ దివిటీ మీడియా.- భద్రాచలం, మార్చి 28
ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఆదివాసీ గిరిజన గ్రామాలలో జరుగుతున్న పనులు ఏప్రిల్ 10వ తేదీలోగా పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. పనులకు సంబంధించిన బిల్లులు ఏప్రిల్ ఐదవ తేదీ నాటికి సమర్పించాలని, పనులు పూర్తి చేయకుండా, బిల్లులు సమర్పించని డీఈలు, ఏఈలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి సంబంధించిన ప్రతిపాదనలు త్వరితగతిన ఐటీడీఏ కార్యాలయానికి అందజేయాలని ఐటిడిఏ పీఓ ప్రతీక్ జైన్ డీఈలు, ఏఈలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నాడు ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజనీరింగ్ పనుల గురించి ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖమ్మం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీతో సమీక్షించారు. గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించిన ఇతర పనుల గురించి కూడా ఆయన సమీక్షించారు. పాఠశాలల మరమ్మత్తుల కోసం నిధులు ఇప్పటికే కేటాయించినందున గిరిజన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలలో మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే వెంటనే చేయించాలన్నారు. ఇలా మైనర్ రిపేర్స్ వేరే పాఠశాలల్లో ఉంటే సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పంపించాలని ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ డీడీని ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలులో డీఈలు ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, ఆదివాసి గిరిజన గ్రామాలలో స్మశాన వాటికలు, అంగన్ వాడీ బిల్డింగులు, ఆశ్రమ పాఠశాల, జిపిఎస్ పాఠశాల, గిరిజన గ్రామాల్లో సైడ్ కాలువలు, సబ్ సెంటర్ల పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. మిగిలిపోయిన నిధులతో పాఠశాలకు సంబంధించి ఇతర పనులేమైనా ఉంటే ప్రతిపాదనలు సమర్పించి, అనుమతి తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అదనపు గదులు, విద్యుత్తు సంబంధించిన సమస్యలు ఉండకుండా ఫ్యాన్లు, లైట్లు, సమకూర్చాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులేమైనా పెండింగ్ ఉంటే విద్యుత్తు సరఫరా కట్ చేయకుండా చూడాలని, వేసవికాలంలో విద్యార్థులకు కరెంటు లేకపోతే ఇబ్బందులు కలుగుతాయన్నారు. సంబంధిత ఏఈలు డీఈలు ప్రత్యేక శ్రద్ధతో పిల్లలకు అవసరమైన పనులు తప్పనిసరిగా చేయాలన్నారు. మంచినీటి సమస్య ఉన్న చోట తప్పనిసరిగా ఆర్ఓ ప్లాంట్ లేదంటే హ్యాండ్ బోర్ వేయించాలని, హెల్త్ సబ్ సెంటర్లలో ఏమైనా మరమ్మత్తులు ఉంటే తప్పనిసరిగా చేయించాలని, నిధులు మాత్రం ఏమీ వృధా కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీ(జనరల్) డేవిడ్ రాజ్, ఈఈ (ట్రైబల్ వెల్ఫేర్) తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.