ఆహా… ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా…?
పోలీసుస్టేషన్‌లో రౌడీషీటర్ బర్త్‌డే వేడుక
ఎస్సైకి మెమో జారీచేసిన ఉన్నతాధికారులు
✍ దివిటీ మీడియా – నిఘావిభాగం, మార్చి 5
‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే పదానికే సరికొత్త నిర్వచనం తెచ్చేలా తన పోలీసుస్టేషన్ లోనే ఓ రౌడీషీటర్ కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడో ఎస్సై. సభ్య సమాజానికి సరికొత్త మెసేజ్ ఇచ్చేలా ఉన్న అతని చర్యపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు, ఆ ఎస్సైకి మెమో జారీచేశారు. స్థానికంగా పెను సంచలనం సృష్టించిన ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ‘దివిటీ మీడియా’ సేకరించిన సమాచారం ప్రకారం పూర్తి వివరాలిలా ఉన్నాయి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి పోలీసుస్టేషన్‌లో అత్యుత్సాహం ప్రదర్శించిన ఎస్సై, ఓ రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు చేశారు. పలు హత్యకేసులలో నిందితుడైన ఆ రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలను పోలీసుస్టేషన్ లోనే ఎస్సై నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రౌడీషీటర్ పుట్టినరోజు వేడుక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడడంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది. మొగుళ్లపల్లి పోలీసుస్టేషన్ ఎస్సై మాధవ్ గౌడ్, తన సామాజికవర్గానికే చెందిన మహేందర్ గౌడ్ అనే రౌడీషీటర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించిన వ్యవహారాన్ని కొందరు వైరల్ చేశారు. అదే జిల్లాలో పోలీసుస్టేషన్లలో మహేందర్ గౌడ్ పేరు మీద రౌడీ షీట్ ఉందని తెలుస్తోంది. ఇంత నేపథ్యం ఉన్న ఆ రౌడీషీటర్ గురించి తెలిసినప్పటికీ, ఎస్సై మాధవ్ గౌడ్ ఈ విధంగా అతని పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆ ఎస్సై మీద చర్యలు తీసుకునే వరకు వెళ్తుందా? లేదంటే సద్దుమణుగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.