రైతులందరికీ ప్రయోజనాలందేలా కృషి చేయండి
భద్రాచలం డివిజన్ సమీక్షలో డీఏఓ బాబురావు
✍ దివిటీ మీడియా – భద్రాచలం, ఫిబ్రవరి 28
రైతుబంధు, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు రైతులందరికీ అందించేలా వ్యవసాయ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయాధికారి వి.బాబురావు సూచించారు. బుధవారం జరిగిన భద్రాచలం డివిజన్ సమీక్షలో ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంకిసాన్ ఆధార్ లింకింగ్, ఏకేవైసీ, ఎన్పీసీఐ వంటివి పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా హక్కులు వచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేయించుకునే విధంగా చూడాలని ఆయన సూచించారు. రైతువేదికలలో గానీ, మీసేవ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారాగానీ రైతులందరూ నమోదు త్వరగా చేయించుకోవాలని, అప్పుడే పీఎంకిసాన్ డబ్బులు వారి ఖాతాలలో జమవుతాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్లపల్లి గ్రామంలో రైతుల పంటపొలాలను సందర్శించారు. సహాయ వ్యవసాయాధికారులు పంట నమోదు సరిగ్గా చేసున్నారా? లేదా? అనే విషయాన్ని ఫీల్డ్ కు వెళ్లి సర్వేనెంబర్ వారీగా నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం ఏడీఏ సుధాకర్ రావు, మూడు మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు నవీన్, అనిల్ కుమార్, శివరామప్రసాద్, మూడు మండలాల ఏఈఓలు పాల్గొన్నారు.