రెజ్లింగ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అంకంపాలెం ఆణిముత్యం
రవ్వ గీతాహర్షిణిని అభినందించిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం, ఫిబ్రవరి 12
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అంకంపాలెం ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాల (ఏజీహెచ్ఎస్) 9వ తరగతి విద్యార్ధిని రవ్వ గీతాహర్షిణిని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అభినందించారు. సోమవారం తన చాంబర్ లో గీతాహర్షిణిని అభినందించిన సందర్భంగా పీఓ మాట్లాడుతూ, ఆమె గిరిజన సంక్షేమశాఖ విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిందని ప్రశంసించారు. క్రీడల అధికారి, పీడీ, పీఈటీల సమక్షంలో శాలువా కప్పి ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఫిబ్రవరి 7,8 తేదీలలో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్-15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5వ తేదీ వరకు పంజాబ్ లోని పాటియాలాలో జరుగనున్న జాతీయ స్థాయి పాల్గొంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గీతాహర్షిణి జాతీయ స్థాయిలో కూడ గోల్డ్ మెడల్ సాదించాలని పీఓ అభిలషించారు. గిరిజన సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, ఏపీఓ (జనరల్) డేవిడ్ రాజు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ రవ్వ గీతాహర్షిణిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థినీ, విద్యార్థులు వారికి ఇష్టమైన క్రీడలలో చురుకుగా పాల్గొని జాతీయస్థాయిలో అవార్డులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ బొల్లి గోపాల్ రావు, ఏఎస్ఓ వెంకటనారాయణ, అంకంపాలెం ఏజీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు టి వెంకటేశ్వర్లు, పీఈటీ జి రవి, తదితరులు పాల్గొన్నారు.