‘కష్టపడి కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు…’
ఐటీసీ పీఎస్ పీడీ జీఎం(హెచ్ ఆర్) శ్యాంకిరణ్
దివిటీ మీడియా – భద్రాచలం, ఫిబ్రవరి 10
కష్టపడి కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, చక్కని ఫలితాలు సాధ్యమని ఐటీసీ పీఎస్ పీడీ జనరల్ మేనేజర్ (హెచ్.ఆర్) పి.శ్యాంకిరణ్ ఉద్భోధించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ ఎం. దేవదాసు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ‘కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినులకు పలు విలువైన సూచనలు అందజేశారు. ప్రణాళిక ప్రకారం విద్యనభ్యసించాలని, ఎవరికి వారు తమకు మార్కులెలా వస్తున్నాయనేది ఎప్పటికప్పుడు చూసుకుని, ఎలా చదివితే మరిన్ని సాధించవచ్చనేది ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని, కష్టపడే విద్యార్థినులకు ఐటీసీ సంస్థ తరఫున సహకారం అందజేస్తామని వెల్లడించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు ఐఐటి, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ్లో సీట్లు సాధించటం గొప్ప విషయమన్నారు. వారికి చక్కని శిక్షణ ఇస్తున్న ప్రిన్సిపల్, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఈ గిరిజన గురుకుల విద్యాసంస్థకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయని తెలిపారు.
ప్రిన్సిపల్ ఎం.దేవదాసు మాట్లాడుతూ, గిరిజన పిల్లలకు సహకరిస్తున్న ఐటీసీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయంలోని టీచర్స్, లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.