సీతారామ ప్రాజెక్టుపై ముగ్గురు మంత్రుల సమీక్ష
పాలేరు నియోజకవర్గానికి నీరందించడంపై ప్రధాన చర్చ
✍🏽 దివిటీ – హైదరాబాదు (జనవరి 7)
ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో రైతులకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల తీరుపై రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈఎన్ సి.మురళీధర్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యత, ఇప్పటి వరకు పూర్తి చేసిన, ఇంకా చేయాల్సిన పనులు, పలు సాంకేతిక పరమైన అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. ప్రధానంగా పాలేరు నియోజక వర్గానికి నీరు ఇచ్చే అంశంపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండటం, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి, అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరందించే అంశం ప్రస్తావించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు పనులపై వారిద్దరూ సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.