‘వైఎస్సార్ జలకళ’ బోరు పనులు పునఃప్రారంభించాలి
తాగునీటి కోసం జిల్లా.మాడుగుల మండలం కూనేటి గ్రామస్తుల డిమాండ్
✍🏽 దివిటీ – జి.మాడుగుల (జనవరి 4)
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం పరిధిలోని కూనేటి గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు కూనేటి గ్రామస్థులు తమ సమస్య గురించి గురువారం ‘దివిటీ మీడియా’కు తెలియజేశారు. కూనేటి గ్రామంలో 2022లో ప్రభుత్వం ‘వైఎస్సార్ జలకళ’ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరందించేందుకు గ్రామంలో బోరు తవ్వించింది. ఆ బోరు తవ్వించి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ పనులు పూర్తి చేయలేదు. గ్రామంలో ఇంటింటికీ ‘కుళాయి’ కనెక్షన్ ఇస్తామని చెప్పిన అధికారులు బోరు తవ్వించి వృధాగా వదిలేశారని, మిగిలిన పనులు మాత్రం జరగడం లేదని కూనేటి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో బోరు పనులు పునఃప్రారంభించాలని లేనిపక్షంలో తాము ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్ల్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. స్థానిక అధికారులు చొరవ తీసుకుని ఈ సమస్య పరిష్కరించకపోతే జి.మాడుగుల మండలకేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఈ సమస్యపై కూనేటి గ్రామస్తులకు అరకు పార్లమెంట్ విద్యార్థి జేఏసీ నాయకుడు వనుగు త్రినాధ్ మద్ధతు పలికారు. కూనేటి గ్రామంలో వైఎస్సార్ జలకళ పథకం ద్వారా తవ్వించిన బోరు పనులు పునఃప్రారంభించి గ్రామంలో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి, ఈ తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కూనేటి గ్రామస్తులు వంజరి బలంనాయుడు, సాగెని బొంజిబాబు, మాతే పండుదొర, పాంగి సింహాచలం, కూనేటి గ్రామస్తులు పాల్గొని నిరసన తెలియజేశారు.