బెల్లంపల్లిలో ఘనంగా ఏబీ బర్ధన్ 8వ వర్ధంతి కార్యక్రమం
✍🏽 దివిటీ – బెల్లంపల్లి (జనవరి 2)
బెల్లంపల్లి పట్టణంలోని భాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు దివంగత ఏబీ బర్ధన్ 8వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడారు. 1924 సెప్టెంబర్ 25న జన్మించిన అర్ధేందు భూషణ్ బర్ధన్ 2016 జనవరి 2న మరణించారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జనరల్ సెక్రటరీ గా పనిచేసిన ఆయన సంక్షుభిత సంకీర్ణ రాజకీయాలశకంలో పార్టీని సమర్థవంతంగా నడిపించారని తెలిపారు. కార్మికనేతగా పలు ఉద్యమాలు చేపట్టిన ఆయన 20 సార్లు అరెస్టయ్యారని, నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారని వివరించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, 1957లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారని, సీపీఐ అనుబంధ కార్మికసంఘం ఏఐటీయూసీకి అధ్యక్షునిగానూ పనిచేశారన్నారు. 1990లో దేశ రాజకీయాల్లో ప్రవేశించి, సీపీఐ జాతీయ ఉప ప్రధానకార్యదర్శిగా ఎదిగారన్నారు. 1996లో యూపీఏ1 సంకీర్ణ ప్రభుత్వంలో సీపీఐ చేరడంలో బర్ధన్ కీలక పాత్ర పోషించారని, అప్పటివరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్ గుప్తా హోంమంత్రి కావడంతో, బర్ధన్ ప్రధానకార్యదర్శి అయ్యారని తెలిపారు. పార్టీకి ఏబీ బర్ధన్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిప్ప నరసయ్య, మండల కార్యదర్శి బొంతల లక్ష్మినారాయణ, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, నాయకులు రత్నం, రాజం, బొంకూరి రామచంద్ర, గుండా ప్రశాంత్, సింగారావు, భరత్, కె.నారాయణ, సింగారావు, శ్రీను, మహేందర్ రెడ్డి, స్వామిదాస్, ఇనుముల రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.