భద్రాద్రి రాముడిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం(డిసెంబర్ 10) భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రులకు జిల్లా అధికారులు, పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో దైవదర్శనం కోసం వచ్చిన రాష్ట్ర మంత్రులకు ఆదివారం సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా పోలీసులు డెప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు గౌరవ వందనం సమర్పించారు. ఆయనతోపాటు రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు కలెక్టర్ డా.ప్రియాంకఅల, ఎస్పీ డాక్టర్ వినీత్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఆలయ ఈఓ రమాదేవి, పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. మంత్రులతో పాటు దైవదర్శనం చేసుకున్న వారిలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, తదితరులున్నారు.