రాష్ట్ర ఫుట్ బాల్ పోటీల పరిశీలకునిగా ప్రేమ్ కుమార్ కు బాధ్యతలు
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు పరిశీలకుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఫుట్ బాల్ జాతీయ క్రీడాకారుడు బట్టు ప్రేమ్ కుమార్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుమతితో రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి రామిరెడ్డి జారీ చేసిన ఉత్తర్వులు ప్రేమ్ కుమార్ మంగళవారం అందుకున్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మహబూబ్ నగర్లో మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల నుంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయజట్టుకు ఎంపిక చేసే ప్రక్రియలో ప్రేమ్ కుమార్ ప్రధాన భూమిక పోషించనున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ రాష్ట్ర ఫుట్ బాల్ క్రీడారంగంలో చిర పరిచితులుగా ఉన్నారు. పలు జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ జట్టుకు నాయకత్వం కూడా వహించారు. భద్రాద్రి జిల్లా నుంచి మొట్ట మొదటిసారిగా రాష్ట్ర పరిశీలకులుగా ప్రేమ్ కుమార్ ఎంపిక కావడం పట్ల ఉమ్మడి జిల్లాల విద్యాశాఖాధికారులు ఎం.వెంకటేశ్వరచారి, ఇ.సోమశేఖరశర్మ, తదితరులు అభినందనలు తెలియజేశారు.