కలెక్టరేట్ లో ఉత్సాహంగా బాలల దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం(నవంబరు 14) బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత అధ్యక్షతన జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో జిల్లాకలెక్టర్ డా.ప్రియాంకఅల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాల్య దశను ఆనందంగా గడుపుతూ, చదువులోనూ ముందంజలోనే ఉండి జీవితంలో ఉన్నతస్థానానికెదిగాలని చిన్నారులకు ఆమె ఈ సందర్భంగా ఉద్భోధ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ భారతీరాణి మాట్లాడుతూ పసి వయసులో ఉన్న పిల్లలు పువ్వులతో సమానమని వారి బాల్యాన్ని చిదిమేయకూడదని, హక్కులను కాపాడాలని తెలియజేశారు. ఈ వేడుకల సందర్భంగా బాల బాలికలకు ఐదురోజుల పాటు బాలబాలికలకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పిల్లల సంతోషం, స్వేచ్ఛాయుత జీవితానికి ప్రతీకగా రంగు రంగుల బెలూన్లను కలెక్టర్ ఆకాశంలోకి ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ చిన్నారులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదనరాజు, డీపీఆర్ఓ శీలం శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనరాణి, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి అన్నామణి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సైదులు, సీడబ్ల్యుసీ మెంబర్ సాధిక్ పాషా, ఐసీడీఎస్ సిబ్బంది కనకదుర్గ, జయలక్ష్మి, హరికుమారి, శుభశ్రీ, సంతోషరూప, కార్యాలయ సిబ్బంది, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్ లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల చిత్రమాలిక…