బలప్రదర్శనతో సత్తా చాటిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత దంపతులు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
గతంలో ఎన్నడూ జరగని విధంగా బూర్గంపాడు మండలంలో ఎన్నికల ప్రచారంకోసం రాష్ట్ర ముఖ్యమంత్రిస్థాయిలో కేసీఆర్ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ కు భారీగా జనసమీకరణ చేయడం ద్వారా బూర్గంపాడు జడ్పీటీసీ సభ్యులు కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు సత్తాను చాటారు. పినపాక నియోజకవర్గంలోనే ఈ మండలంలో కాస్త ఎక్కువగా ఉన్న వ్యతిరేక పరిస్థితులను సానుకూలంగా మలచుకునే ప్రయత్నంలో వారిద్దరూ అన్నీ తామై చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించినట్లుగా విశ్వసనీయ సమాచారం. జనసమీకరణతో సరిపెట్టకుండా, సీఎం కేసీఆర్ సభలో ‘జోష్’ నిండేలా తీసుకున్న జాగ్రత్తలు కూడా మంచి ఫలితాన్నివ్వడంతో సానుకూలత దక్కిందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సభా నిర్వహణకోసం చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిచ్చాయని ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల సభకు హాజరైన సీఎం కేసీఆర్ కు జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభతో పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలలో ఎన్నికల ప్రచారోత్సాహం కాస్త పెరిగిందని విశ్లేషకులు అచనా వేస్తున్నారు. ఈ తాజా సానుకూలతను ‘ఓట్ల రూపంలోకి’ మలచు కోవడంలో బీఆర్ఎస్ నాయకులు ఏమేరకు సఫలమవుతారనేది తెలుసుకునేందుకు మాత్రం నవంబరు 30వన జరిగే పోలింగ్, ఆ తర్వాత 3 రోజుల్లోనే వెలువడే ఎన్నికల ఫలితాలదాకా వేచిచూడాల్సిందే మరి… బీఆర్ఎస్ పినపాక, భద్రాచలం అభ్యర్థులు రేగా కాంతారావు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, కొత్తగూడెం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా ఈ సభలో పాల్గొన్నారు.