నవంబర్ 1, 2 తేదీల్లో ఉమ్మడి జిల్లా పాఠశాలల అథ్లెటిక్స్, ఎంపికలు
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
ఉమ్మడి ఖమ్మంజిల్లా పాఠశాలల్లో అండర్- 17 బాల బాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నవంబర్ 1వ తేదీన, అండర్- 14 బాల బాలికల ఎంపికలు నవంబర్ 2వ తేదీన ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలోపేర్కొన్నారు. ఈ ఎంపికలలో పాల్గొనే ఆసక్తిగల అండర్- 17 క్రీడాకారులు 1వ తేదీ ఉదయం 9గంటల్లోపు ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో హాజరుకావాలని ఆయన సూచించారు. ఇదేవిధంగా అండర్ -14 క్రీడాకారులు కూడా నవంబర్ 2వ తేదీ హాజరు కావాలని కోరారు. పోటీల్లో పాల్గొనే అండర్-17 క్రీడాకారులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. వీరు 2007 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలని తెలిపారు. 9, 10వ తరగతి చదువుతున్న వారైతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి మెమో ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని, ప్రిన్సిపాల్ చేత సంతకం చేయించుకుని, ఆ కళాశాల బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని హాజరుకావాలని కోరారు. అండర్-14 క్రీడాకారులు 6వ తరగతినుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వారు అర్హులని వెల్లడించారు. పైన పేర్కొన్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అథ్లెటిక్స్ ఎంపికల కు అనుమతించేదిలేదని ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శలు
కె.నర్సింహామూర్తి, స్టెల్లా ప్రేమ్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న అథ్లెటిక్స్ ట్రైనర్స్, అంపైర్స్, పీఈటీలు, పీడీలు ఈ నియమ నిబంధనలను పాటిస్తూ 1వ తేదీ ఉదయం 9గంటల్లోపు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం గ్రౌండ్ కు చేరుకోవాలని వారు కోరారు.