స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఏఎస్పీ పరితోష్ పంకజ్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
రక్తదానం ప్రాధాన్యత చాటి చెప్తూ, సిబ్బంది, ప్రజలకు ఆదర్శంగా నిలిచి, స్పూర్తినిచ్చేలా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తానూ స్వయంగా రక్తదానం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణకార్యక్రమాల్లో భాగంగా భద్రాచలం సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానశిబిరంలో గురువారం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఇలా ఆదర్శంగా నిలిచారు. ఎంతో మంది పోలీసుల ప్రాణత్యాగాలకు గుర్తుగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) నిర్వహించే సందర్భాన్ని ఆయన వివరించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఈ రక్త దాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలంఏఎస్పీ పరితోష్ పంకజ్ శిబిరాన్ని ప్రారంభించారు. భద్రాచలం పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ప్రజలు, యువకులు, తదితరులు 50 మందికి పైగా రక్తదానం చేశారు. ఏఎస్పీ ఏరియా ఆసుపత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రాన్ని పరిశీలించి, రక్తం శుద్ధిచేసే విధానాలు, రక్త దానం వల్ల కలిగే ఉపయోగాలు, తదితర అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రామకృష్ణ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, ఈ రక్తదానశిబిరం వల్ల నియోజకవర్గంలో ఉన్న తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటు మరి కొందరు రోగులకు రక్తం లభిస్తుందన్నారు. కాబట్టి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సమయంలో ప్రజలంతా తనంతట తామే ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ఆ విధంగా చేయడం అందరికీ శుభదాయకం అని తెలిపారు. రక్తదానం చేసినవారు ప్రాణ దాతలతో సమానమని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యసిబ్బందికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజురెడ్డి, ఎస్సైలు మధుప్రసాద్, పివీఎన్ రావు, సిబ్బంది, బ్లడ్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు జిందా, కొప్పుల మురళి, తదితరులు పాల్గొన్నారు.