పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్, అతిథిగృహం ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.వినీత్
✍🏽 దివిటీ మీడియా – ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం బస్టాండ్ ఏరియాలో ‘పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్, గెస్ట్ హౌస్’లను జిల్లా ఎస్పీ డా.వినీత్ బుధవారం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించేందుకు గాను జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్బంగా ఆయన తెలియజేసారు. జిల్లా పరిధిలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన పోలీసుల కుటుంబసభ్యులలో ఆర్థికంగా వెనుకబడినవారికి ఈ బంకులలో జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రజలు కూడా ఈ బంకులో నాణ్యమైన ఇంధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు వివిధ రకాల బందోబస్తులకు ఇల్లందు పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పోలీసులకోసం ఏర్పాటుచేసిన అతిథి గృహాన్ని కూడా జిల్లా ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు కరుణాకర్, రవీందర్, ఇంద్రసేనారెడ్డి ఆర్ఐలు కామరాజు, కృష్ణారావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.