పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు అహర్నిశలు కృషిచేస్తున్న పోలీసులు
పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకోవాలి : జిల్లా ఎస్పీ డా.వినీత్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ప్రజల రక్షణకోసం పోలీసులు చేసే త్యాగం వెలకట్టలేనిదని, ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్బంగా శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారకస్థూపానికి ఎస్పీ డా.వినీత్ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముందు జిల్లా ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గత సంవత్సరకాలంలో దేశ వ్యాప్తoగా అమరులైన 189 మంది పోలీస్ అమరవీరుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయిమనోహర్ చదివి వినిపించారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ, 1959 అక్టోబరు 21న పంజాబ్ కు చెందిన 21మంది ఐటీబీపీ పోలీసులు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తిస్తుండగా, చైనా బలగాలు సియాచిన్ భూబాగాన్ని ఆక్రమించేందుకు చేసిన ప్రయత్నాన్ని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడారని తెలిపారు. ఆ పోరాటంలో పదిమంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు.హాట్ స్ప్రింగ్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థమని, కానీ ఆ హాట్ స్ప్రింగ్ భారత జవాన్ల రక్తంతో తడిచి, నెత్తుటిబుగ్గగా మారి ‘పవిత్రస్థలం’గా రూపు దిద్దుకుందని తెలిపారు. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్రస్థలాన్ని సందర్శించి నివాళులుర్పించే ఆనవాయితీ ఉందన్నారు.ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసు అమరుల ప్రాణత్యాగ ఫలితంగానే నేడు సమాజంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనం గడుపుతున్నామని వివరించారు. అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ప్రతి ఏటా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణత్యాగంచేసిన 189 మందిని స్మరిస్తూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల తరపున వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు.
తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి విచ్ఛిన్నకర శక్తులు, నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అరికట్టి ప్రజల భద్రతకు భరోసా కల్పించడానికి అమరులత్యాగాలే స్ఫూర్తిగా ప్రజాసేవకు అందరూ పునరంకితం కావాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం పోలీసు వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ అమరవీరులకు స్మారక స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓఎస్డీ టి.సాయిమనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు డీఎస్పీలు వెంకటేష్, రెహమాన్, రమణమూర్తి, రాఘవేందర్రావు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, సైబర్ క్రైమ్స్ డీఎస్పీ కృష్ణయ్య, ఆర్ఐలు రవి, సుధాకర్, నరసింహరావు, కృష్ణారావు,లాల్ బాబు, నాగేశ్వరరావు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.