Divitimedia
Bhadradri KothagudemCrime NewsPoliticsTelanganaYouth

ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు

ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు

వివరాలు ప్రకటించిన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు ముగ్గురు మావోయిస్టు ఆర్పీసీ సభ్యుల (మిలిటెంట్ల)ను అరెస్టు చేశారు. ఆ వివరాలను భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం… చర్ల మండలం పరిధిలోని   వెంకటచెరువు గ్రామ అటవీప్రాంతంలో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి  అక్టోబరు 20వ తేదీ (శుక్రవారం) వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆర్పీసీ   సభ్యుల(మిలిటెంట్లు)ను అరెస్టు చేసినట్లు వివరించారు. అరెస్టు చేయబడిన నిషేధిత మావోయిస్టు పార్టీ మిలిటెంట్లను ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ ఠాణా పరిధిలో ఉన్న చిన్నఉట్లపల్లి గ్రామానికి చెందిన మడివి గంగ, అదే ప్రాంతంలో ఉన్న రాంపూర్ గ్రామానికి చెందిన మడివి అంద, భీమారం గ్రామానికి చెందిన కొవ్వసి మంగు అనేవారుగా గుర్తించినట్లు వివరించారు. ఈ ముగ్గురు పూజారి కాంకేర్ ఆర్పీసీ పరిధిలో  మిలీషియా సభ్యులుగా ఉంటూ, నిషేధిత మావోయిస్టుపార్టీ వారు చెప్పిన పనులను  చేస్తుంటారని తెలిపారు. అంతేగాక నిషేధిత మావోయిస్ట్ పార్టీ నిర్వహించే మీటింగులకు,  సభలకు ఇతర గ్రామాల నుంచి ప్రజలను బలవంతంగా బెదిరించి తీసుకు రావడంతో పాటు మావోయిస్టు పార్టీ వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించడం వంటి పనులు చేస్తుంటారని ఏఎస్పీ వెల్లడించారు. ఆ కార్యకలాపాలలో భాగంగా మావోయిస్టు  పార్టీ ఛత్తీస్ గడ్ రాష్ట్ర అగ్రనాయకులు, బెటాలియన్ కమాండర్ హిడ్మ, పామేడ్ ఏరియా కమిటీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులైన  దామోదర్, ఆజాద్, మధు, అరుణ, లచ్చన్న, మంగతు, అర్జున్, తదితర దళ సభ్యులందరూ కలిసి ‘తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను బహిష్కరించండి’ అంటూ  చెప్పే కరపత్రాలను చర్ల గ్రామ శివారులలో వేసి వచ్చే పని అప్పగించారని తెలిపారు. ఈ ఎన్నికల బహిష్కరణకు సంబంధించిన మీటింగ్ ఉంటుందని, సిద్దంగా ఉండాలని చెప్పే సమాచారం చేరవేయాలని పూజారి కాంకేర్ ఆర్పీసీ మిలీషియా సబ్యులైన ఈ  ముగ్గురినీ ఆదేశించి, వీరికి 60 కరపత్రాలు  ఇచ్చి పంపించారని వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురు చర్ల గ్రామానికి పరిసర గ్రామాలలో ఆ కరపత్రాలను వేయడానికి వస్తుండగానే, వెంకటచెరువు గ్రామం శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు తారస పడి, పారిపోవడానికి ప్రయత్నించగా, వీరిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారని ఈ సందర్భంగా ఏఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. పట్టుబడిన ఈ ముగ్గురి వద్ద నుంచి 60 కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ ప్రకటించారు. నిషేధిత  మావోయిస్టుపార్టీకి ఎవరైనా సహకరించినా,  సంఘవిద్రోహక చర్యలకు పాల్పడినా, వారి మీద కఠినచర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ బి.రాజగోపాల్, ఎస్సైలు టి.వి.ఆర్.సూరి, ఆర్.నర్సిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సారపాకలో చిన్నారులకు ‘ఆధ్యాత్మిక పరీక్ష’

Divitimedia

ఐఎన్టీయూసీ మిత్రపక్షాల కేలండర్ ఆవిష్కరించిన ఐటీసీ ఉన్నతాధికారులు

Divitimedia

‘ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పౌరులే నిజమైన దేశభక్తులు’

Divitimedia

Leave a Comment