ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, పోలింగ్ శాతం పెంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అక్టోబరు 31వ తేదీ లోగా 18సంవత్సరాలు నిండిన వారెవరైనా ఓటుహక్కు నమోదు చేసుకోకపోతే, వారు నమోదుచేసుకునేందుకు అవకాశముందని, తప్పని సరిగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆరోగ్యం సహకరించని దివ్యాంగులు, 80 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులు, ఆరోగ్యం సహకరించక మంచానికే పరిమితమైన వారి కోసం ఫారం-12 (డి) ద్వారా తమ ఇంటి నుంచే ఓటుహక్కును వినియోగించుకునేందుకు అంగీకార పత్రం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలా నమోదు చేసుకున్న వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటినుంచి ఓటుహక్కు వినియోగం కోసం అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కులమతాలహక్కులు, విశ్వాసాలకు భంగంవాటిల్లేలా ప్రకటనలు, ప్రచారాలకనుమతి లేదన్నారు. తప్పుడు, అసత్య ప్రచారాలను నియంత్రించేందుకు ఎంసీఎంసీ పని చేస్తుందన్నారు. ప్రచారాలు, సభలు, సమావేశాలు, ర్యాలీల అనుమతి కోసం ‘సువిధ’ ఆన్లైన్ యాప్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చేసే ప్రకటనలపై దృష్టిసారించి తగిన చర్యలకు ఆ కమిటీ ఆదేశాలు జారీ చేస్తుందని వివరించారు.
జిల్లాలో గుర్తించిన 294 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షించనున్నామని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నామని, ఆయా కేంద్రాల్లో భద్రతా సిబ్బందితో పాటు ఓటరు స్లిప్పులు జారీచేసే సమయంలో బీఎల్వోలు అప్రమత్తంగా విధులు నిర్వర్తించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రూ.50వేలకు మించిన నగదు పట్టుకుంటే ముగ్గురు అధికారుల కమిటీ పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న సొమ్మును భద్రపరుస్తున్నట్లు వెల్లడించారు. ఆ సొమ్ము పక్కదారి పట్టకుండా జిల్లా సహకార శాఖ అధికారి నోడల్ అధికారిగా డీఆర్డీఓ, ట్రెజరీ అధికారులు జిల్లా ‘గ్రీవెన్స్ కమిటీ’ నిఘా ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, సొమ్ముపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారం కమిటీకి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఆక్రమాల కట్టడి కోసం కేంద్ర ఎన్ని కలసంఘం 2018 లో సి-విజిల్ యాప్ అందుబాటులోకి తెచ్చిందని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, అక్రమాలకు పాల్పడినా యాప్ ద్వారా పిర్యాదు చేయడంపై ప్రచారం కల్పిస్తున్నామని తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని, ఎక్కడైనా నగదు, మద్యం పంపిణీ చేసినట్లు కనిపించినా, ఎన్నికల నియమావళిని అతిక్రమించినా అప్పటికపుడు తీసిన ఫొటో లేదంటే వీడియోను యాప్ ద్వారా పంపించి పిర్యాదు చేసేందుకు అవకాశముందన్నారు. యాప్ లో ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే ఆటో లోకేషన్ ద్వారా ఎన్నికలఅధికారులు చూసి 100 నిమిషాల్లో చర్యలు చేపడతారన్నారు. 1950 నెంబరు కంట్రోల్ రూముకు వచ్చిన పిర్యాదులపై కూడా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 24 గంటలపాటు పనిచేసేలా పటిష్ట పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వేలెన్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోటీచేసే అభ్యర్థుల తరపున ఇతరులెవరైనా ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా
నియమావళి పాటించడంపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించామని వెల్లడించారు.