‘ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పౌరులే నిజమైన దేశభక్తులు’
‘కేసీఆర్, మోడీల మాటల గారడీలకు మరోసారి మోసపోకండి’
పీవైఎల్ రాష్ట్ర 8వ మహాసభలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
✍🏽 దివిటీ మీడియా – మహబూబాబాద్
దేశంలో కులమతాలకతీతంగా, సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఆలోచనలతో, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పౌరులే నిజమైన దేశభక్తులని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం(పి.వై.ఎల్) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ప్రతినిధులసభ జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, సమాజాభివృద్ధికి, నూతన భారతదేశ నిర్మాణానికి విద్యార్థి, యువత శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించే ఆలోచనలు కలిగివుండటం చాలా కీలకమని తెలిపారు.
దేశంలో ఒక్క రైల్వే రంగంలోనే 2.74లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలో 25వేల ఉపాధ్యాయ పోస్టులు, పలురకాల రంగాల్లో 60లక్షల పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకోకుండా దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడు తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యకు 25శాతం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే, మనదేశంలో బిజెపి ప్రభుత్వం 4 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 6.5 శాతం మాత్రమే నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమని ఆయన ఆక్షేపించారు. అభివృద్ధి చెందిన దేశాలు యువతను శాస్త్ర సాంకేతిక రంగాల వైపు ప్రోత్సహిస్తుంటే, దేశంలోని యువతను తిరోగమనం వైపు నెడుతున్నారన్నారు. విద్యార్థులు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, మన రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బిజెపి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, కొత్తహామీలు గుప్పిస్తూ అధికార పీఠం ఎక్కేందుకు మోడీ కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మోసపు హామీల సునామీలో యువత కొట్టుకుపోవద్దని, మాటల గారడీలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో పిట్టలదొరలను మించి పోయిన మోడీ, కేసీఆర్ లకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమాజంలో మార్పు కోసం జరిగే ప్రజా పోరాటాల్లో యువత క్రియాలక పాత్ర పోషించాలని కోరారు. దళిత గిరిజన ఆదివాసి అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రగతిశీల యువకులు పెద్దఎత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రతినిధుల సభ ప్రారంభానికి ముందు పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కె కాశీనాథ్ బిగిపిడికిలి జెండా ఆవిష్కరించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ మహాసభలో అరుణోదయ కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. మహాసభలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్న, టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మనోహర్ రాజ్, పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ సందేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకులు ఎన్ వి రాకేష్, వాంకుడోత్ అజయ్, పైండ్ల యాకయ్య, కందాల రంగయ్య, ఇరుగు అనిల్, ప్రజాసంఘాల నాయకులు కొత్తపల్లి రవి, ముంజంపల్లి వీరన్న, బిల్లకంటి సూర్యం, బండపల్లి వెంకటేశ్వర్లు, ఉమ్మగాని సత్యం, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.