గుండాలలో అక్టోబరు 13నుంచి గిరిజన గురుకుల జోనల్ క్రీడలు
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు
ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న నిర్వాహకులు, కలెక్టర్, ఐటీడీఏ పీఓకు ఆహ్వానం
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
గిరిజన గురుకుల విద్యాలయాల ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలస్థాయి 7వ జోనల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ అక్టోబరు 13నుంచి గుండాలలోని గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు బాలురకు నిర్వహించనున్న ఈ క్రీడా పోటీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధి నుంచి దాదాపు 700మంది పాల్గొనబోతున్నారు. ఈ క్రీడాపోటీల కోసం నిర్వాహకులు మైదానాన్ని సిద్ధం చేయడం, క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు గుండాలలో నిర్వహించనున్న ఈ గురుకుల జోనల్ క్రీడలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటిడిఏ ఏపీఓ(జనరల్), గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయాధికారి హెచ్ డేవిడ్ రాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈపోటీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని గిరిజన గురుకులాలకు చెందిన 18 పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ డా ప్రియాంకఅల, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ లకు ఈ క్రీడాపోటీల ఆహ్వానపత్రికలు అంద జేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గుగులోతు హరికృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ విప్పా సత్యనారాయణ, అర్థశాస్త్ర అధ్యాపకుడు ఎ రామచంద్రరావు తదితరులు కూడా పాల్గొన్నారు.