Divitimedia
Bhadradri KothagudemPoliticsTelangana

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలి

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలి

ఎన్నికల నిర్వహణ సన్నద్ధత సమావేశంలో కలెక్టర్ ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి డా.ప్రియాంకఅల కోరారు. ఈ మేరకు మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో పోలీస్, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, ప్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్ టీమ్ అధికారులు, వివిధ విభాగాల నోడల్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె ఎన్నికల్లో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగేలా ఎన్నికల విధులపై సిబ్బంది సమగ్రమైన, స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పటిష్ట పర్యవేక్షణ జరగాలని, టోల్ ఫ్రీ నెంబరు.1950, సి-విజిల్ యాప్ ల ద్వారా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణం విచారణ నిర్వహించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణపై సమగ్ర అవగాహనకు నియోజకవర్గస్థాయిలో నిరంతరం సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. కమ్యూనికేషన్, ట్రాన్స్ పోర్ట్ లపై ప్రణాళిక తయారు చేయాలని, పోలింగ్ కేంద్రాలవారీ రూట్ మ్యాపులు తయారుచేయాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు విధులు చాలా ప్రధానమైనవని, ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని, జిల్లాలో ఉన్న 1095 పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు, వీల్ చైర్ల వంటి మౌలిక సదుపాయాలుండాలని చెప్పారు. మండలస్థాయిలో ఎంపీడీఓలు ఎన్నికల ప్రవర్తనానియమావళిని పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలను తాను తనిఖీ చేస్తానని, ఏర్పాట్లులో లోటు పాట్లు లేకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఎన్నికల విధుల నిర్వహణ పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా ఎన్నికలసంఘ నియమావళి ప్రకారం కఠినచర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మినహాయింపులు లేవని, ప్రతిఒక్కరూ ఎన్నికల విధుల్లో భాగ స్వాములు కావాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో పటిష్ట పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని, ఏదైనా సమస్య వస్తే సమీపం లోని పోలీసుస్టేషన్లో వెంటనే సమాచారం అందించాలని చెప్పారు. లైసెన్సు కలిగిన పిస్టల్స్ పోలీసుశాఖకు సరెండర్ చేయాలని, సరెండర్ చేయని పక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని చెప్పారు. నగదు రవాణా చేసే వ్యక్తులు తగిన ఆధారాలను తప్పకుండా తమవెంట ఉంచుకోవాలని, సీజ్ చేయబడిన నగదు విడుదలపై ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురుసభ్యుల కమిటీ ఉంటుందని, పరిశీలించిన తర్వాత విడుదల చేస్తామని ఆయన చెప్పారు. రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో వచ్చే వార్తలపై పర్యవేక్షణ ఉంటుందని తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సభలు, సమావేశాలు, మైకు, ర్యాలీల కోసం సువిధ యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డీఆర్డీఓ రవీంద్రనాధ్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, అన్ని డివిజన్లకు చెందిన డీఎస్పీలు, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు దంపతులను సన్మానించిన కలెక్టర్

Divitimedia

తహశీల్దారు కార్యాలయంలో క్రిస్మస్ కానుకల పంపిణీ

Divitimedia

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక యాప్ విడుదల చేసిన పోలీసుశాఖ

Divitimedia

Leave a Comment