Divitimedia
Bhadradri KothagudemCrime NewsPoliticsTelangana

రాజధాని ప్రాంతంలో తొలిరోజే రూ.8కోట్లు పట్టివేత

రాజధాని ప్రాంతంలో తొలిరోజే రూ.8కోట్లు పట్టివేత

ఖమ్మం జిల్లా మధిరలో రూ.17.20లక్షలు పట్టివేత

కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే తనిఖీలు ఆరంభం

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, ఖమ్మం

ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో సోమవారం అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలు లోకి వచ్చింది. ఆ వెనువెంటనే చెక్ పోస్టుల్లో తనిఖీలు కూడా ఆరంభించారు. డబ్బు, మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఉపయోగపడే వస్తువులన్నింటి రవాణా మీద నియంత్రణ అమలవుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తొలిరోజే
రాష్ట్రంలో వేర్వేరు చోట్ల తనిఖీల్లో దాదాపు రూ. 8కోట్ల దాకా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. అబిడ్స్ ఏరియాలో 7 కిలోల బంగారం, 295 కిలోల వెండి, శంకరపల్లిలో రూ.80.88లక్షలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ.41.8లక్షలతోపాటు మరికొన్ని చోట్ల నగదు పట్టుబడింది. ‘కోడ్’ అమలు లోకి వచ్చిన వెంటనే ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఆత్కూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేసిన తనిఖీలలో రూ.17.20 లక్షలు పట్టుబడ్డాయి. ఆత్కూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో మధిర రూరల్ ఎస్సై రఫీ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొదటిరోజు ఓ కారు తనిఖీ చేసిన అందులో రూ.12.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో తనిఖీలో రూ.4.60 లక్షలు పట్టుకోవడం జరిగిందని ఎస్సై రఫీ విలేకరులకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చినందువల్ల వ్యాపారస్తులు, ప్రజలు తీసుకెళ్లే డబ్బులకు తప్పనిసరిగా సరైన పత్రాలు ఉండాలని, ఆ విధంగా లేనిపక్షంలో స్వాధీనం చేసుకోక తప్పదని ఆయన తెలిపారు. నిబంధనలలో ముఖ్యమైన ఎన్నికల ప్రచారం విషయంలో కూడా ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల ప్రచారం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను మీడియాలోను, పత్రికాముఖంగా ప్రజలకు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. మరో ముఖ్యమైన మార్పులో భాగంగా ఈసారి పోలింగులో ఓటర్లు అభ్యర్థులను గుర్తుపట్టే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవీఎం మీద ఎన్నికల గుర్తుతో పాటు, ఆ అభ్యర్థి ఫొటో కూడా ఉండేవిధంగా ఏర్పాటు చేశారు.

Related posts

వచ్చే నెలాఖరులోగా 108ఇళ్లు పంపిణీకి సిద్ధం చేయాలి

Divitimedia

అడుగడుగునా అవకతవకలమయంగా ఈజీఎస్

Divitimedia

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment