‘తెలంగాణ ఎన్నికల్లో పోటీ’ గురించి ‘వైజాగ్’లో ప్రకటించిన కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని వెల్లడి
✍🏽 దివిటీ మీడియా – విశాఖపట్నం, హైదరాబాదు
విలక్షణ ప్రవర్తన, విపరీతమైన హడావుడి, మితిమీరిన ఆత్మవిశ్వాసం కలగలిసినట్టు కనిపించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, మళ్లీ మరోసారి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ సీట్ల లో తమ ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ గురించిన ఈ ప్రకటన కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ పట్టణంలో చేయడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం వైజాగ్ లో ఉన్న కేఏ పాల్, అక్కడ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందంటూ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందు వల్ల అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీచేసే 119మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు. ”కులమతాలకతీతంగా ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేస్తా, నేను మన దేశాన్ని, మన రెండు తెలుగు రాష్ట్రాలనూ కాపాడుకుంటున్నా… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేయకుండా వెనక్కి తగ్గి ఆపేశారు. ఏపీలో బీజేపీ పార్టీ లేదు… ఇజ్రాయెల్, పాలస్తీనాల గొడవలు ఆగిపోవాలని దేవుడికి ప్రార్థన చేశా. శాంతి కోసం మీరందరు కూడా ప్రార్థన చేయాలి… డిసెంబర్10వ తేదీన ప్రపంచ గ్లోబల్ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటాం… ఆ గ్లోబల్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు 5 వేల మందిని ఆహ్వానిస్తున్నాం… డిసెంబర్ 10వ తేదీన ఇక్కడి నుంచే 200 దేశాలకి శాంతి సందేశం ఇస్తాను…” అంటూ కేఏ పాల్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత ఎక్కడ మధ్యంతర ఎన్నికలు జరిగినా తన మార్కు హడావుడితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తనను తానుగా రక్షకుడిగా గుర్తు చేసే మత ప్రచారకుడు కేఏ పాల్, మరోసారి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్కు చూపెట్టనున్నారు.