పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషక విలువలున్న ఆహారాన్ని అందించే లక్ష్యంతో సీఎం అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. శుక్రవారం జిల్లాలో లక్ష్మిదేవిపల్లి మండలం, ఇందిరానగర్ లోని మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి, కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో సీఎం అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో బీసీ కాలనీలోని ప్రాధమిక పాఠశాలలో 55మంది విద్యార్థులకు, భద్రాచలం తాతగుడి సెంటర్ ప్రాధమిక పాఠశాలలో 159మందికి, లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రాధమిక పాఠశాలలో 115మందికి, పినపాక నియోజకవర్గంలో మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో 124 మందికి, ఇల్లందులో స్టేషన్ బస్తీ మండల పరిషత్ ప్రాధమికపాఠశాలలో 45మంది విద్యార్థులు కలిపి జిల్లా పరిధిలోని మొత్తం 498 మంది విద్యార్థులకు అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. దసరా సెలవుల తర్వాత జిల్లాలోని 1387 పాఠశాలల్లో ఈ పథకాన్ని వర్తింప చేస్తామని, ఈ పథకం ద్వారా 96,897 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు విద్యార్థులకు అందించే ‘అల్పాహారం మెనూ’ను అన్ని పాఠశాలలకు పంపినట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం రాగానే ఆ పాఠశాలల్లో రాగానే అల్పాహారం అందించే విధానం అమలవుతుంని వివరించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకం అమలు చేపట్టినట్లు చెప్పారు. పరగడుపున ఉంటే సక్రమంగా చదవలేరని గ్రహించిన ప్రభుత్వం అల్పాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంలో ఇష్టమైన ఆహారాన్ని అందిస్తున్న విషయం గుర్తించి, విద్యార్థులు ఇష్టంగానే చదవాలని చెప్పారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న కలెక్టర్, ఎమ్మెల్యే, ఉపాధ్యాయులను, వంటవారిని అభినందించారు. ఇదే నాణ్యత పాటిస్తూ ప్రతిరోజు విద్యార్థులకు అల్పాహారం అందించాలని సూచించారు. పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం మండలస్థాయిలో నోడల్ అధికారులు, నియోజకవర్గస్థాయి ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అల్పాహారం మెనూ కరపత్రాలు, పథకం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటాచారి, జడ్పీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్రావు, ఎంపీపీ భూక్యా సోనా, సర్పంచ్ పూనెం నాగేశ్వరావు, సంక్షేమ అధికారి విజేత, సీఎం అల్పాహారం ప్రత్యేక అధికారి స్వర్ణలతలెనీనా, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, ఎంపీటీసీ కొల్లు పద్మ, ఎస్ఎంసీ ఛైర్మన్ చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.