ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్
జిల్లాలో 1095 పోలింగ్ కేంద్రాల్లో 9,45,094 మంది ఓటర్లు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో ఓటర్ల తుది జాబితాను జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2 ప్రణాళిక పూర్తయిందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు, ఓటరు జాబితా సవరణ, ముసాయిదా ఓటరు జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ప్రత్యేక ఓటు నమోదు శిభిరాల నిర్వహణ, ఓటునమోదు, తొలగింపులు, మార్పులకు దరఖాస్తులు స్వీకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో గతనెల 19వతేదీ వరకు మొత్తం 68,703 దరఖాస్తులు రాగా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి ఆన్ లైన్లో నిక్షిప్తం చేసినట్లు చెప్పారు. దాని ఆధారంగా తుది ఓటరు జాబితాను రూపొందించామని చెప్పారు. జిల్లాలో ఐదు నియోజకర్గాల్లోని 1095 పోలింగ్ కేంద్రాల్లో 9,45,094 మంది ఓటర్లున్నారని, వారిలో 4,61,315 మంది పురుషులు, 4,83,741 మంది మహిళలు, 38మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు చెప్పారు. జాబితాలలో 14,130 మంది దివ్యాంగులు, 22,096మంది 18-19వయస్సులోని వారు, 13,082 మంది 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులను గుర్తించినట్లు చెప్పారు.
ఎన్ఆర్ఐలు 43మంది, 731సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.