ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును జాబితాలో పరిశీలించుకోవాలి
సమీక్షలో ఓటరు జాబితా పరిశీలకురాలు బాలమాయాదేవి
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును ఓటరు జాబితాలో పరిశీలించుకోవాలని ఓటరు జాబితా పరిశీలకురాలు బాలమాయాదేవి కోరారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో ప్రత్యేక ఓటరు సవరణపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, నమోదు ప్రక్రియల గురించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా పరిధిలో ప్రస్తుతమున్న 1092 పోలింగ్ కేంద్రాలకు అదనంగా భద్రాచలంలో 2, కొత్తగూడెంలో 1 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆమె చెప్పారు. 1950కంట్రోల్ రూమ్, ఎన్వీఎస్పీ పోర్టల్ కు ఓటరు నమోదు, ఎపిక్ కార్డులు జారీ ప్రక్రియపై వచ్చిన 155 పిర్యాదులన్నీ పరిష్కరించినట్లు చెప్పారు. నూతన ఓటర్ల నమోదు కోసం 2016- 2020 మధ్య 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులపై ప్రత్యేకదృష్టి పెట్టినట్లు చెప్పారు. ఐసీడీఎస్, ఇంటర్మీడియట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా లబ్దిపొందిన జాబితాలు లక్ష్యంగా చేసుకుని ఓటు నమోదుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో కొండకోనల్లో జీవిస్తున్న కొండరెడ్ల కుటుంబాలకు 692 మందికి నూతనంగా ఓటుహక్కు కల్పించడంతోపాటు, 18-19 సంవత్సరాల యువతీ,యువకులు కొత్తగా ఓటుహక్కు కోసం నమోదు కావడం పట్ల తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో మొత్తం 9,45,094మంది ఓటర్లలో 4,61,315 మంది పురుషులు, 4,83,741 మంది మహిళలు, 38మంది ట్రాన్స్ జెండర్లు నమోదైనట్లు చెప్పారు. 14,130 మంది దివ్యాంగులు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు చెప్పారు. 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించనున్నామని, ఆ ఓటరు జాబితాను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, అన్ని పోలింగ్ కేంద్రాల్లోను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. జనాభా లెక్కల ప్రకారం ఇంకా ఓటుహక్కు నమోదు చేసుకోవాల్సిన వారున్నారని, తప్పనిసరిగా ఓటరు హెల్ప్ లైన్, ఎన్వీఎస్పీ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరుజాబితా బాధ్యతగా పరిశీలించుకుని ఓటుహక్కును నిర్దారణ చేసుకోవాలన్నారు. చివరి నిమిషం వరకు వేచి ఉండి, తమకు ఓటు హక్కు లేదనే పిర్యాదులు చేయొద్దని ఆమె సూచించారు. సరైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిపించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఆగష్టు 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత వచ్చిన 68,703 అభ్యంతరాలను పరిష్కరించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా దివ్యాంగులు, 80సంవత్సరాల పైబడిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ గురించ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీఆర్ఓ రవీంద్రనాధ్, కొత్తగూడెం ఆర్డీఓ శిరీష, ప్రత్యేక ఉపకలెక్టర్ కాశయ్య, నియోజకవర్గ కేంద్రాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.