Divitimedia
Bhadradri KothagudemPoliticsSpot NewsTelanganaTravel And Tourism

శ్రీరామచంద్రుడి ఆలయాభివృద్ధిపై ‘తారకరాముడి’కి నిరసన సెగ

శ్రీరామచంద్రుడి ఆలయాభివృద్ధిపై ‘తారకరాముడి’కి నిరసన సెగ

ముగ్గురు మంత్రుల భద్రాద్రి పర్యటనపై సర్వత్రా ఆసక్తి

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

తండ్రి మాట నిలబెట్టడం కోసం అలనాడు  అడవులకెళ్లిన శ్రీరామచంద్రుడి ఆలయాన్ని  అభివృద్ధి చేస్తామనే ‘మాట’ విషయంలో ఈ నాటి ‘తారకరాముడి’కి రామభక్తులు, పుర ప్రజల నుంచి నిరసన ఎదురుకాక తప్పడం లేదు. భద్రాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి గురించి తన తండ్రి ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల ‘తారకరామారావు’ భద్రాచలం ప్రాంత ప్రజలకు ఏం జవాబులు చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.  చాలాకాలం తర్వాత భద్రాచల పర్యటనకు వస్తున్న కేటీ రామారావును ఈ విషయంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ నాయకులు పత్రికాముఖంగా నిల దీశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికాసమావేశంలో ఎమ్మెల్యే  వీరయ్య సూటిగా ప్రశ్నించారు. భద్రాచలం పర్యటనలలో ముఖ్యమంత్రి హోదాలో తన  తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలకు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీఎం వారసుడు కేటీఆర్ తప్పకుండా  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  గత తొమ్మిదేళ్లలో భద్రాచలం పుణ్యక్షేత్రంలో  అభివృద్ధి పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించిన విషయంపై, భద్రాచలం ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భద్రాచలం ప్రాంత అభివృద్ధికి  వెచ్చించిన నిధుల గురించి మంత్రి  కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే వీరయ్య డిమాండ్ చేశారు. వరదలొచ్చిన సమయంలోనే భద్రాచలంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కరకట్ట నిర్మాణానికి, బాధితుల పునరావాసానికి ప్రకటించిన రూ.1000కోట్లపై సమాధానం చెప్పాలన్నారు.  భద్రాచలం అభివృద్ధి కోసం ఆంధ్రలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని భద్రాచలం ప్రజలతోపాటు, ఈ ప్రాంతం ప్రజాప్రతినిధిగా తన పోరాటానికి  కూడా కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.  గోదావరి వరదల బాధితులకు శాశ్వతమైన పరిష్కారం చూపేలా ఎత్తైన ప్రదేశాల్లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారని, దీనిపైన కూడా కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.  శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి తలంబ్రాలు కూడా సమర్పించకుండా సీఎం ముఖం చాటేస్తూ, రాముని ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నదానిపై ఆయన కొడుకుగా మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత వల్ల పేదప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం పలుమార్లు తెలిపినా,  ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈ  సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. ఈసమస్యపైనా మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దుమ్ముగూడెం మండలం ప్రగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చర్ల మండలంలో వద్దిపేట చెక్ డ్యాం, తాలి  పేరు ప్రాజెక్ట్ పెండింగ్ పనులు,వెంకటాపురం మండలంలో పాలెంవాగు ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్, వాజేడు మండలంలో మోడికుంట వాగు ప్రాజెక్టు సమస్యల గురించి కేటీఆర్ మాట్లాడాలని కోరారు. చెత్త వేసుకోవడానికి కూడా స్థలం లేకుండా ఇబ్బంది పడుతున్న భద్రాచల పట్టణాన్ని మూడు పంచాయతీల కింద ముక్కలు చేయడం పట్ల సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని భద్రాచలం ప్రజల ఓట్ల కోసమే  ఈ శంకుస్థాపనలు, ఆర్భాటాలు చేయడం తప్ప, భద్రాచల ప్రాంతానికిచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన లేదని ఆరోపించారు. ఈ  పరిస్థితుల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల  మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భద్రాద్రి పర్యటనలో ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. కరకట్టల నిర్మాణం కోసం ఇక్కడ శంకుస్థాపన చేయడమే ప్రధాన కార్యక్రమం కాబట్టి, ఆ విషయంలో సమర్థించుకోవడం సహజమే. కాకపోతే స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య లేవనెత్తిన పలు ఇతర సమస్యలు, అంశాలపై మంత్రులు ఏవిధంగా స్పందించ బోతున్నారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల నుంచి కూడా మంత్రులకు భద్రాద్రి పర్యటనలో నిరసనలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగూ ఎన్నికల పొత్తు లేదనేది తేటతెల్లం అయింది కాబట్టి, వామపక్షాలు కూడా కాస్త గట్టిగానే నిలదీసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిలో ముగ్గురు మంత్రుల పర్యటనల కోసం అధికారులు కూడా కాస్త ‘గట్టిగానే’ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం మాత్రం మంత్రుల భద్రాద్రి పర్యటన నుంచి మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.

Related posts

శరవేగంగా ‘కాలం రాసిన కథలు’ షూటింగ్

Divitimedia

గోదావరిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

Divitimedia

భార్యపై కోపంతో 8ఏళ్ల కన్నకూతురిని చంపిన కసాయి తండ్రి

Divitimedia

Leave a Comment