శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్”
నూతన జాతీయ అవార్డుల విభాగాలు ప్రకటించిన కేంద్రం
అత్యున్నత పురస్కారంగా “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం”
✍🏽 దివిటీ మీడియా – డిల్లీ
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో దేశ పౌరులను మరింత ప్రోత్సాహించేలా కేంద్ర ప్రభుత్వం “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం” పేరిట నూతన జాతీయఅవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు అవార్డులు, వాటిని అందించే రంగాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నుంచి గురువారం (సెప్టెంబర్ 21) విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, లేదంటే ఆవిష్కర్తలు వ్యక్తిగతంగా గానీ, బృందాలు గానీ వినూత్నంగా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో చూపించిన ప్రతిభ, శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల అభివృద్ధికోసం వారందించిన సహకారానికి గుర్తింపుగా “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం” అవార్డులు ప్రదానం చేస్తారు. ‘రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం’ భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో చేసిన కృషిని గుర్తింపుగా ఇచ్చే ‘అత్యున్నతస్థాయి పురస్కారంగా’ ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల అభివృద్ధికి, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలు చేసిన వారు గానీ ఆవిష్కరణల పరంగా విశిష్ట సహకారాన్ని అందించిన ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు గానీ వ్యక్తిగతంగా పనిచేస్తున్న వ్యక్తులు గానీ ఈ అవార్డులకు అర్హులు. విదేశాల్లో నివసిస్తూ భారతదేశ ప్రజలు, సమాజానికి ప్రయోజనం చేకూర్చే అసాధారణ సహకారం అందించిన వారు కూడా ఈ అవార్డులకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సైన్స్ లాంటి 13 రంగాల్లో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ప్రదానం చేస్తారు. లింగ సమానత్వంతో ప్రతి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్’ కోసం అందిన అన్ని నామినేషన్లు కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పిఎస్ఎ) నేతృత్వంలో ఏర్పాటైన రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార కమిటీ (ఆర్.వి.పి.సి) పరిశీలిస్తుంది. కమిటీ సభ్యులుగా శాస్త్ర విభాగాల కార్యదర్శులు, శాస్త్ర, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలకు చెందిన విద్యావేత్తలు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులుంటారని కేంద్రం వెల్లడించింది. ఈ అవార్డుల కోసం ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 28(నేషనల్ సైన్స్ డే) వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం మే 11వ తేదీ (జాతీయ సాంకేతిక దినోత్సవం) రోజు ప్రకటిస్తారు. ఈ అన్ని విభాగాలకు సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవం మాత్రం ఆగస్టు 23(జాతీయ అంతరిక్ష దినోత్సవం) రోజు జరుగుతుందని ప్రకటించారు. అన్ని అవార్డులకు సర్టిఫికెట్, పతకం కూడా ప్రదానంచేస్తారు. నూతనంగా ప్రకటించిన ఈ జాతీయ అవార్డులు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతస్థాయి శాస్త్ర వేత్తలు సాధించిన విజయాలు, దేశాభివృద్ధి కోసం వారు చేసిన కృషిని గుర్తించి, వారిని గౌరవించడానికి కేంద్రప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ నూతన జాతీయ అవార్డులుంటాయని పేర్కొన్నారు. మొత్తం ఎంపిక ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాత విధానాలతో జరుగుతుందని కూడా కేంద్రం ప్రకటించింది. “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్” ఇతర జాతీయ అవార్డులతో సమానమైన హోదా కలిగి ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
——————————-
నాలుగు విభాగాల్లో ప్రదానం చేసే జాతీయ అవార్డుల వివరాలు…
——————————-
1. విజ్ఞానరత్న (విఆర్ ) అవార్డు : శాస్త్ర, సాంకేతికరంగంలో సాధించిన జీవితకాల విజయాలు, కృషికి గుర్తింపుగా విజ్ఞానరత్న (విఆర్ ) అవార్డు అందిస్తారు.
2. విజ్ఞాన్ శ్రీ (విఎస్) అవార్డు : శాస్త్ర , సాంకేతికరంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా విజ్ఞాన్ శ్రీ (విఎస్) అవార్డు ప్రదానం చేస్తారు.
3. విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్ (వివై- ఎస్.ఎస్.బి) అవార్డు : 45 సంవత్సరాలలోపు వయస్సు గలిగి శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి అసాధారణ సహకారం అందించే యువ శాస్త్రవేత్తలను గుర్తించి, ప్రోత్సహించడానికి విజ్ఞాన్ యువ- శాంతిస్వరూప్ భట్నాగర్ (వివై-ఎస్.ఎస్.బి) అవార్డు అందిస్తారు.
విజ్ఞాన్ బృందం (విటి) అవార్డు : ఈ విభాగంలో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలతో కూడిన బృందానికి విజ్ఞాన్ బృందం (విటి) అవార్డు ప్రదానం చేస్తారు. ఏదైనా శాస్త్ర, సాంకేతికరంగంలో బృందంగా ఏర్పడి, అసాధారణ సహకారమందించే వారికి ఈ విజ్ఞాన్ బృందం (విటి ) అవార్డు అందజేస్తారు.